అక్కడి నుంచి అన్ని విమానాలు రద్దు
శ్రీనగర్: వరుసగా రెండో రోజు జమ్మూకశ్మీర్ లోని శ్రీనగర్ విమానాశ్రయంలో విమాన రాకపోకలకు అంతరాయం కలిగింది. పొగమంచు దట్టంగా అలముకోవడంతో సోమవారం అన్ని విమాన సర్వీసులను రద్దు చేసినట్టు ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు. పొగమంచు కారణంగా వెలుతురు మందగించడంతో విమానాలను రద్దు చేసినట్టు చెప్పారు.
ప్రతికూల వాతావరణంతో ఆదివారం కూడా విమాన సర్వీసులకు ఆటంకం ఏర్పడింది. అంతకుముందు రోజు కూడా పలు సర్వీసులకు అంతరాయం కలిగింది. పరిస్థితిని సమీక్షించి విమాన సర్వీసుల పునరుద్దరణపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు. రానున్న 24 గంటల్లో పొగమంచు మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో విమాన ప్రయాణికులకు మరిన్ని రోజులు ఇబ్బందులు తప్పకపోవచ్చని అధికారులు అంటున్నారు.