
ఈ రోజు కూడా విమాన సర్వీసులు బంద్
శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లోని శ్రీనగర్ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు వరుసగా ఆరోరోజు కూడా అంతరాయం ఏర్పడింది. దట్టమైన పొగమంచు, వెలుతురులేమి కారణంగా మంగళవారం ఈ విమానాశ్రయంలో విమాన సర్వీసులను ఆపివేశారు.
వాతావరణ పరిస్థితిలో మార్పు రాలేదని, దీంతో ఇక్కడి నుంచి వెళ్లాల్సిన, రావాల్సిన అన్ని విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్టు శ్రీనగర్ ఎయిర్ పోర్టు అధికారి శరద్ కుమార్ చెప్పారు. ఆరు రోజులుగా శ్రీనగర్‌లో ఇదే పరిస్థితి నెలకొంది. శనివారం మాత్రం విమానాలను పాక్షికంగా పునరుద్దరించారు. ఇక్కడికి కేవలం రెండు విమానాలు వచ్చి వెళ్లాయి. వాతావరణం అనుకూలించకపోవడంతో ఆదివారం, సోమవారం ఒక్క విమాన సర్వీసును కూడా నడపలేదు. ఈ రోజు కూడా రద్దు చేశారు.