నాడు ఎడిటర్.. నేడు బికారి
ముంబైలో ‘గృహలక్ష్మి’ మేగజైన్ ఎడిటర్ దుస్థితి
ముంబై: పేరు సునీతా నాయక్.. మరాఠీ మేగజైన్ ‘గృహలక్ష్మి’కి ఎడిటర్. ఈమెకు పుణేలో రెండు బంగ్లాలు.. వొర్లీ ప్రాంతంలో రెండు ఫ్లాట్లు.. రెండు కార్లు.. ఆకలేస్తే తాజ్ హోటల్ నుంచి వేడి వేడి బిర్యానీలు, తందూరీలు... ఇదంతా ఆమె బాగా బతికిన రోజుల సంగతి! ప్రస్తుతం ముంబై వెర్సోవా ప్రాంతంలోని వీధుల్లో ఫుట్‌పాత్‌పైనే ఆమె నివాసం. 12 ఏళ్లుగా తాను పెంచుకుంటున్న పొమేరియన్ కుక్కతో కలిసి ఆమె రెండు నెలలుగా జేపీ రోడ్డులోని గురుద్వారా సచ్‌ఖంద్ దర్బార్ వద్ద బతుకీడుస్తోంది. ‘‘ఒకప్పుడు తాజ్ నుంచి భోజనం తెప్పించుకునేదాన్ని. ఇలాంటి పరిస్థితి నాకు వస్తుందని నేను ఎప్పుడూ ఊహించనేలేదు’’ అని ఆమె ఆవేదన వ్యక్తంచేసింది.
రూ.50 లక్షలు ఏమయ్యాయో..
‘‘పుణేలో వారసత్వంగా వచ్చిన బంగ్లాను అవసరమొచ్చి రూ.6 లక్షలకు అమ్మేశాను. వొర్లీ ప్రాంతంలోని ఫ్లాట్లను, రెండు కార్లను రూ.80 లక్షలకు అమ్మేశాను. తర్వాత థానేలో ఓ బంగ్లా లీజ్‌కు తీసుకొని అందులోకి వచ్చేశాను. కానీ ఆ తర్వాత నా బ్యాంకు ఖాతాలో ఉండాల్సిన రూ.50 లక్షలు క్రమక్రమంగా తగ్గిపోయాయి. చివరికి వెర్సోవాలో తక్కువ అద్దెకు ఇల్లు తీసుకోవచ్చని ఇక్కడికొచ్చి.. ఇదిగో ఇలా ఫుట్‌పాత్ మీద సెటిలయ్యాను’’ అంటూ సునీత తన కథను చెప్పుకొచ్చారు.
‘‘గురుద్వారా సిబ్బంది చాలా మంచివాళ్లు. రోడ్డు మీద ఉన్న తాత్కాలిక మండపం వద్ద ఉండేందుకు అవకాశమిచ్చారు. వాళ్లే అన్నం పెడుతున్నారు’’ అని తెలిపారు. మీ ఖాతాలో డబ్బులు ఎలా తగ్గిపోయాయని అడగ్గా.. ‘‘నా కంపెనీలో పనిచేసిన మాజీ ఉద్యోగి కమల్ రాయ్‌కర్‌కే తెలిసుండాలి. ఆమె బాయ్‌మహాలిన్‌లో ఓ రూమ్‌లో ఉండేది. ఆమే నా ఖాతాలు ఆపరేట్ చేస్తుండేది. ఏం జరిగిందో ఆమెను అడిగితేగానీ తెలీదు. 15 ఏళ్లు ఆమే నా బాగోగులు చూసుకుంది’’ అని తెలిపారు.
మా ఇంట్లో ఉండండి...: సునీతా నాయక్ కథను మీడియా ద్వారా తెలుసుకున్న పలువురు ప్రముఖులు ఆమెకు నివాస సదుపాయం కల్పిస్తామంటూ మంగళవారం ముందుకొచ్చారు. వారిలో గజల్ గాయకుడు అశోక్ ఖోస్లా, వైల్ పార్లే వాసి లారీ డిసౌజా తదితరులున్నారు. వారు పుణెలో నివాస ఏర్పాట్లు చేస్తామని చెప్పినా, ఆమె నిరాకరించారు. తన డబ్బు ఏమైపోయిందో తెలుసుకునే వరకు ముంబైలోనే ఉంటానని చెప్పారు. దీంతో ముంబైలోని వైల్ పార్లే ప్రాంతానికి చెందిన దంపతులు గ్రెగరీ, క్రిస్టియా మిస్కిటా ఆమెను తమ ఇంటిలో ఉండడానికి ఆహ్వానించారు. ప్రస్తుతం ఆమె వారింట్లో ఉంటున్నారు.