‘జియోమైసూర్’కు జీ హుజూర్! | Mineral reserves of 80 crore | Sakshi
Sakshi News home page

‘జియోమైసూర్’కు జీ హుజూర్!

Published Thu, Aug 6 2015 2:15 AM | Last Updated on Sun, Sep 3 2017 6:50 AM

‘జియోమైసూర్’కు జీ హుజూర్!

‘జియోమైసూర్’కు జీ హుజూర్!

2223.95 ఎకరాల అభయారణ్యంలో ఖనిజాన్వేషణకు పచ్చజెండా
* సాధుకొండ ప్రాంతంలో రూ. 60 వేల కోట్ల నుంచి
* 80 వేల కోట్ల ఖనిజ నిక్షేపాలు


సాక్షి, హైదరాబాద్: చిత్తూరుజిల్లా సాధుకొండ అభయారణ్యంలో 2223.95 ఎకరాల (9 చదరపు కిలోమీటర్ల) అభయారణ్యంలో బంగారం, వెండి, రాగి, ఇనుము, లెడ్, జింక్ అన్వేషణకు వీలుగా మూడేళ్లు అమల్లో ఉండేలా ప్రభుత్వం ప్రాస్పెక్టింగ్ లెసైన్సు (పీఎల్) మంజూరు చేసింది. ఈమేరకు భూగర్భ గనుల శాఖ కార్యదర్శి రావత్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రజల ఆందోళనను తోసిరాజంటూ బెంగుళూరుకు చెందిన జియోమైసూర్ సర్వీసెస్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్‌కు అనే సంస్థకు పీఎల్ మంజూరు చేయడం వెనుక ప్రభుత్వ పెద్దలే ప్రధాన పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. వేలాది కోట్ల విలువైన బంగారం, వెండి, ఇనుము ఇతర ఖనిజ నిక్షేపాలు పెద్దమొత్తంలో ఉండటంవల్లే ప్రభుత్వం ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా ఈ సంస్థకు జీహుజూర్ అందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.... చిత్తూరు జిల్లాలోని సాధుకొండ అభయారణ్యంలోని మల్లయ్యకొండ, సాధుకొండ, ఇనుముకొండల్లో భారీ స్థాయిలో బంగారం, వెండి, ఇనుము, రాగి తదితర నిక్షేపాలున్నాయని జియోలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వేలో తేల్చింది. ఇనుము ఎక్కువగా ఉన్నందునే ఇక్కడి కొండను ప్రజలు ఇనుము కొండ అంటున్నారు. దీంతో ఇక్కడ లీజు తీసుకుని ఖనిజాలు తవ్వి విక్రయించడం ద్వారా వేల కోట్లు గడించాలని పలు సంస్థలు దృష్టి సారించాయి.

‘జియోమైసూర్’ సంస్థ గతంలోనే ఈ ప్రాంతంలోని 2223.95 చదరపు ఎకరాల్లో పీఎల్ కోసం దరఖాస్తు చేసింది. దీనిపై నిర్ణయాధికారం కేంద్ర ప్రభుత్వానిదే అయినందున అప్పటి ప్రభుత్వం ఫైలును కేంద్రానికి పంపింది. కేంద్రం విధించిన షరతులను ఆ కంపెనీ నెరవేర్చకపోవడంతో ఆ ఫైలును పక్కన పెట్టేసింది. దీంతో చేసేదేంలేక మౌనంగా ఉన్న జియోమైసూర్ 2012లో తన ప్రయత్నాలను మొదలుపెట్టింది. అప్పటి ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుతో మాట్లాడుకుని అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై ఒత్తిడి పెంచింది. అప్పట్లో అవిశ్వాస తీర్మానం సందర్భంగా కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం కూలిపోకుండా చంద్రబాబు అండగా నిలిచిన సంగతి తెలిసిందే.

ఆ నేపథ్యంలోనే తమ దరఖాస్తును ఆమోదించాలంటూ జియోమైసూర్ ప్రతినిధులు ఏకంగా మూడుసార్లు (సెప్టెంబరు 3న, నవంబరు 6న, డిసెంబరు 6న) ప్రభుత్వానికి లేఖలు రాశారు. ఈ విషయం బయటకు పొక్కడంతో జిల్లాలోని పలు ప్రాంతాల వారు ఆందోళనలు చేపట్టారు. పవిత్రమైన దేవాలయాలున్న ప్రాంతంలో తవ్వకాలకు అనుమతించరాదంటూ ధర్నాలు, ప్రదర్శనలకు దిగారు.

దీంతో దిగివచ్చిన ప్రభుత్వం ప్రముఖ పుణ్యక్షేత్రమైన మల్లయ్యకొండలో మైనింగ్‌కు అనుమతించే ప్రసక్తే లేదని 2012 నవంబరు 10న అప్పటి ప్రభుత్వం వెల్లడించింది. తదుపరి భూగర్భ గనులు, అటవీ, రెవెన్యూ అధికారులు ఈ ప్రాంతంలో పర్యటించి ఈ కొండల్లో 40పైగా గుళ్లు, గుహలు ఉన్నాయని  ప్రకటించారు. ఆ తర్వాత విభజన ఉద్యమం, ఎన్నికల నేపథ్యంలో ఆ ఫైలు పక్కన పడిపోయింది. తాజాగా టీడీపీ ప్రభుత్వంలోని కీలక నేత నేరుగా సంబంధిత అధికారులను ఆదేశించి పీఎల్ మంజూరు చేయించారు.
 
ప్రాధాన్యం ఎందుకంటే...
సాధుకొండ ప్రాంతంలో రూ. 60 వేల కోట్ల నుంచి 80 వేల కోట్ల విలువైన బంగారం, ఇనుము, వెండి, రాగి తదితర ఖనిజ నిక్షేపాలున్నాయని గతంలో సర్వేలు తేల్చాయి. స్వాతంత్య్రం రాక మునుపే 1942లో బ్రిటిషు ప్రభుత్వ హయాంలోనే మల్లయ్యకొండ, సాధుకొండ ప్రాంతాల్లో బంగారు ఖనిజం వెలికితీతకు రంగం సిద్ధం చేసినా.. సహాయ నిరాకరణ ఉద్యమం ఎగిసిపడటంతో వెనక్కి తగ్గింది.

ఈ నేపథ్యంలో బంగారం తవ్వకాల్లో అనుభవం ఉన్న జియోమైసూర్ సంస్థ ఈ ప్రాంతంలో మొదట పీఎల్ తీసుకుని తర్వాత మైనింగ్ లెసైన్సు తీసుకోవడం ద్వారా తవ్వకాలు జరపాలని నిర్ణయించుకుంది. ఖనిజాన్వేషణకు సంబంధించి ఈ సంస్థ నివేదిక సమర్పించిన తర్వాత మైనింగ్ లీజు కోసం దరఖాస్తు చేయడం... దానికే లీజు మంజూరు చేయడం ఖాయమని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ‘పీఎల్ వచ్చిందంటే తర్వాత ఎంఎల్ వచ్చినట్లే. గనులు, ఖనిజాల అభివృద్ధి నియంత్రణ చట్టం - 2015కు లోబడి ఈ సంస్థ దరఖాస్తు అమల్లో ఉందని ప్రత్యేకంగా ప్రభుత్వం పేర్కొనడాన్ని బట్టి ఈ విషయం స్పష్టమవుతోంది’ అని భూగర్భ గనుల శాఖకు చెందిన ఒక అధికారి ‘సాక్షి’తో చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement