బూమ‘రాంగ్’ అవుతుందేమో..!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఉన్నత విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పినట్టు ప్రొఫెసర్ ప్రసాద్‌రెడ్డిని సస్పెండ్ చేస్తే అది భవిష్యత్‌లో మరిన్ని చిక్కులకు దారి తీస్తుందని వర్సిటీ వర్గాలు భావిస్తున్నారు. విశాఖలో ఏయూ విద్యార్థులు నిర్వహించిన ‘యువభేరి’ సదస్సులో పాల్గొన్న ప్రొఫెసర్ ప్రసాదరెడ్డిపై మంత్రి అభీష్టం మేరకు చర్యలు తీసుకోవడం నిబంధనల ప్రకారం కుదరదని అంటున్నారు. యూజీసీ నిబంధనలను ఏమాత్రం అతిక్రమించని ప్రసాదరెడ్డిపై చర్య తీసుకుంటే అది బూమ‘రాంగ్’ అయి తమకే ఎదురుతిరుగుతుందని వర్సిటీ అధికారులు భావిస్తున్నారు.
ఏయూ అధికారవర్గాల్లో విస్మయం...
ఢిల్లీలో ఉన్న ఏయూ వీసీ జీఎస్‌ఎన్ రాజుకు మంత్రి గంటా బుధవారం ఫోన్ చేసి ప్రసాదరెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాలు నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో వీసీ జీఎస్‌ఎన్ రాజు ఇరకాటంలో పడ్డారు. దాన్నుంచి తప్పించుకోవడానికి రిజిస్ట్రార్ రామ్మోహన్‌రావుకు వీసీ గురువారం ఫోన్ చేసి ప్రసాదరెడ్డికి నోటీసులు ఇవ్వాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. వీసీ జోక్యం చేసుకోకుండా తన ద్వారా మంత్రి ఆదేశాలను అమలు చేయిద్దామని చూస్తున్నారని రిజిస్ట్రార్ రామ్మోహన్‌రావు భావిస్తున్నారు. అందుకే వీసీ శుక్రవారం విశాఖపట్నం వచ్చేవరకూ ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని నిర్ణయించుకున్నట్టు సమాచారం.
మంత్రిది అవగాహనరాహిత్యం...
ప్రొఫెసర్ ప్రసాదరెడ్డి యూజీసీ నిబంధనలను ఉల్లఘించినట్లు కాదని విద్యారంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రజాసంబంధమైన సదస్సుల్లో పాల్గొనే వెసులుబాటు ప్రొఫెసర్లకు ఉందని వారు స్పష్టం చేశారు. ప్రొఫెసర్ ప్రసాదరెడ్డిపై చర్యలకు ఆదేశించిన మంత్రి గంటాది అవగాహనరాహిత్యమని వారు అన్నారు. బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి మురళీమనోహర్ జోషి అలహాబాద్ యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా ఉంటూనే ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమాలకు హాజరయ్యేవారని, అప్పటి ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ప్రసంగించేవారని ఉదాహరించారు.
ఇటువంటి నేపథ్యంలో రాష్ట్రానికి ప్రాణప్రదం అయిన ప్రత్యేకహోదా ఆవశ్యకత గురించి చర్చించడానికి విద్యార్థులు నిర్వహించిన సదస్సులో పాల్గొని ప్రత్యేక హోదా ఆవశ్యకతను వివరించడంలో ప్రసాదరెడ్డి నిబంధనలు ఉల్లంఘించినట్లుకాదనే ఏకాభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉన్నత విద్యాశాఖ మంత్రికి విశ్వవిద్యాలయాలపై నేరుగా ఎలాంటి అధికారం ఉండదు. ఆయన వీసీలకు ఆదేశాలు జారీ చేయలేరని కూడా నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
యూజీసీ నిబంధనలను ఉల్లంఘించ లేదు: ప్రొఫెసర్ ప్రసాదరెడ్డి
‘‘నేను 27ఏళ్లుగా ఏయూలో పనిచేస్తున్నాను. రిజిస్ట్రార్‌గా, రెక్టార్‌గా కీలక అడ్మినిస్ట్రేటివ్ పోస్టుల్లో పనిచేసిన నాకు యూజీసీ నిబంధనలపై పూర్తి అవగాహన ఉంది. ప్రొఫెసర్‌గా ప్రజోపయోగ అంశాలు, ‘పాలిటీ’పై ప్రభుత్వానికి, సమాజానికి సూచనలు చేసే బాధ్యత, హక్కులు నాకు ఉన్నాయి. యువభేరి సదస్సులో నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమీ మాట్లాడలేదు. ప్రత్యేక హోదా సాధిస్తే విద్యార్థులకు, యువతకు ఎంత ప్రయోజనం కలుగుతుందో వివరించాను. నేను చేసిన సూచనలు పాటిస్తే, హోదా వస్తే ఈ ప్రభుత్వానికే మంచిపేరు వస్తుంది...’’