కేసీఆర్‌ది చాలా చిన్న వయస్సు: మంత్రి కేటీఆర్
హైదరాబాద్: ‘ప్రస్తుతం కేసీఆర్ వయస్సు 64 ఏళ్లు. భారత సమకాలీన రాజకీయాలను బట్టి చూస్తే కేసీఆర్‌ది చాలా చిన్న వయస్సు. మరో 15, 20 ఏళ్లు రాజకీయాల్లో ఉండి ఆయన పార్టీని, ప్రభుత్వాన్ని నడిపిస్తారు. ఆలోపు నేను లేదా హరీశ్ రిటైర్ కావొచ్చు. ప్రస్తుతం కేసీఆర్‌గారే మాకు బాస్. మరో 15, 20 ఏళ్లు ఆయన నాయకత్వంలోనే అందరం కలిసి పనిచేస్తాం. మాకు స్వతంత్రంగా ఎజెండాలు లేవు. ఆశలు లేవు. హరీశ్ రావుతో ఆరోగ్యకరమైన పోటీ ఉంది. అధికారం కోసం మా మధ్య పోటీ లేదు’ అని తెలంగాణ ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు స్పష్టంచేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండున్నరేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ‘సాక్షి’ టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన సూటిగా సమాధానాలు చెప్పారు. తమ కుటుంబంలో విభేదాలు లేవని, పార్టీలో హరీశ్‌తో తనకు ఆరోగ్యకరమైన పోటీ ఉందని స్పష్టం చేశారు. మంత్రివర్గంలో ఒక్క మహిళ కూడా లేకపోవడం లోటేనని అంగీకరించారు. ఆ లోటును ముఖ్యమంత్రి పూడుస్తారని భావిస్తున్నట్టు తెలిపారు.
కోదండరాం..
‘జేఏసీను ఏర్పాటుచేసింది, జేఏసీకి చైర్మన్‌గా కోదండరాంను నియమించింది కూడా కేసీఆర్‌గారే. కానీ ఏ కారణం వల్లనో ప్రభుత్వానికి ఆయనతో విభేదాలు వచ్చాయి. ఆ విభేదాలు పెరుగుతున్నాయి. ఎక్కడ టెంటు వేసినా వెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం ఆయనకు కూడా మంచిది కాదు’ అని కేటీఆర్ హితవు పలికారు. కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ అనేక బాలారిష్టాలు ఎదుర్కొన్నప్పటికీ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని, ప్రజల విశ్వాసాన్ని చూరగొని.. వారితో శెభాష్ అనిపించుకునేవిధంగా సాగుతున్నదని తెలిపారు.
దేశవ్యాప్తంగా తెలంగాణ చాలావేగంగా ముందుకువెళ్లుతున్నదని, ఈ విషయం అనేక జాతీయ సర్వేల్లో వెల్లడైందని చెప్పారు. సీఎం కేసీఆర్ పరిపాలనాధ్యక్షుడు కాబట్టే ఆరునెలల వ్యవధిలో తెలంగాణ విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించిందని చెప్పారు. పెద్దనోట్ల రద్దు ఉద్దేశాలు మంచివే అయినా, దీనివల్ల ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలని తెలిపారు.