కాంగ్రెస్ నేతల్లా దొంగ పనులు చేయం
రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నేతల మాదిరిగా తాము కుంభకోణాలు, దొంగ పనులు చేయడంలేదని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ విమర్శించారు. దేశాన్ని, రాష్ట్రాన్ని దోచుకున్న కాంగ్రెస్ పార్టీకి తమను విమర్శించే అర్హతలేదన్నారు. సచివాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. ప్రాజెక్టుల పేరుతో అడ్వాన్స్ పేమెంట్లు తీసుకోవడం కాంగ్రెస్ నేతలకే అలవాటని తలసాని ఆరోపించారు.
కాంగ్రెస్‌లో ఆధిపత్యపోరు ఉందని, అందులో భాగంగా ఆ పార్టీ నాయకులు తమ ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధిపట్ల కాంగ్రెస్ నేతలకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ వద్దకెళ్లి కర్ణాటకలోని అక్రమ ప్రాజెక్టులను ఆపించాలన్నారు. మద్యం పాలసీ విషయంలో అన్నిపార్టీల నేతలు కావాలనే రాజకీయ విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం ప్రజలకు మంచి నీళ్లు ఇవ్వకుండా మద్యం సరఫరా చేస్తోందా? అని ప్రశ్నించారు.
ఏపీలో విచ్చలవిడిగా బెల్టుషాపులు కొనసాగుతున్న వైనం టీడీపీ నేతలకు కనిపించడం లేదా? గుజరాత్‌లో ప్రతి పాన్‌షాప్‌లో లిక్కర్ దొరుకుతుందనే విషయం బీజేపీ నేతలకు తెలియదా? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేశానని గొప్పలు చెప్పుకునే ఏపీ సీఎం చంద్రబాబు.. ఏడాదైనా ఏపీలో ఎందుకు కొత్త రాజధానిని నిర్మించలేకపోతున్నారని ప్రశ్నించారు.