
బ్రేకింగ్: మంత్రి పోచారంకు అస్వస్థత!
తిరుమల: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు తిరుమల వెంకన్న దర్శనానికి వచ్చిన వ్యవసాయమంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. అల్పాహారం తీసుకోకపోవడంతో ఆయన స్వల్పంగా అనారోగ్యానికి గురయినట్టు తెలుస్తోంది. ఉదయం స్వామివారి దర్శనం చేసుకొని.. తిరిగి అతిథి గృహానికి చేరుకున్న అనంతరం ఆయన అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయాన్ని గుర్తించిన బంధువులు మొదట ఆయనను తిరుమలలో ఉన్న అశ్వినీ ఆస్పత్రికి తరలించారు.
ఛాతిలో నొప్పి వస్తుందని చెప్పడంతో వెంటనే పక్కనే ఉన్న అపోలో ఆస్పత్రిలో తరలించి.. చికిత్స అందిస్తున్నారు. ఆయనకు ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మీడియాను లోపలికి అనుమతించడం లేదు. ప్రస్తుతానికి పోచారం ఆరోగ్యం బాగానే ఉందని వైద్యవర్గాలు చెప్తున్నాయి. మంత్రి పోచారం అస్వస్థత నుంచి కోలుకున్నారని, చికిత్స అనంతరం హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యారని సమాచారం.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, ఆయన కుటుంబసభ్యులు, స్పీకర్, మంత్రులతో సహా బుధవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకొని.. మొక్కులు తీర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వెంట మంత్రి పోచారం కూడా ఉన్నారు.