సభ్యసమాజం తలదించుకునేలా..
న్యూఢిల్లీ: కీచక సంతతి పశువాంఛకు పసిమొగ్గల జీవితాలు నాశనమవుతున్నాయి. అమాయక చిన్నారులపై అఘాయిత్యాలు జరగకుండా అడ్డుకునేందుకు ఎన్ని చట్టాలు చేసినా కామపిచాచుల అగడాలకు బంధనాలు వేయలేకపోతున్నాయి. దేశవ్యాప్తంగా పసిబాలికలపై పెరుగుతున్న లైంగిక వేధింపులు సభ్యసమాజం తలదించుకునేలా చేస్తున్నాయి. అన్నెంపున్నెం ఎరుగని బాలికలను చెర బడుతున్న దారుణ ఘటనలు నానాటికీ ఎగబాకుతుండడం భయాందోళన కలిగిస్తోంది. బంధువులు, సన్నిహితులే చిన్నారుల పాలిట కీచకులుగా మారుతుండడం మరింత దిగ్భ్రాంత పరుస్తోంది. దేశవ్యాప్తంగా తాజాగా వెలుగులోకి వచ్చిన దారుణాలు మృగాళ్ల పైశాచికాలకు అద్దం పడుతున్నాయి.
* ఎనిమిదేళ్ల బాలికపై నలుగురు సామూహికంగా లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో జరిగింది. నలుగురు నిందితుల్లో ఇద్దరు బాలిక బంధువులేకావడం శోచనీయం. వీరిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.
* చాక్లెట్ ఆశ చూపి మైనర్ బాలికను కదులుతున్న కారులో చెరబట్టిన మరో దారుణ ఘటన పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
* ఐదేళ్ల బాలికపై పొరుగింటి వ్యక్తి లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ జిల్లా మసూరిలో వెలుగులోకి వచ్చింది. చాక్లెట్ ఆశ చూపి చిన్నారిపై కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
* కామంలో కళ్లు మూసుకుపోయిన 50 ఏళ్ల వ్యక్తి రెండురేళ్ల మనుమరాలిపై అత్యాచారానికి ఒడిగట్టి.. ఆనక హతమార్చిన దిగ్భ్రాంతకర ఘటన పశ్చిమగోదావరి జిల్లా గణపవరం మండలం కేశవరం గ్రామంలో ఈ నెల 20న చోటుచేసుకుంది. నిందితుడు బొడ్డి ఏసును అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.