నిజాయితీకి నిలువుటద్దం ఈ మనుషులు | Mizo people are renown for their honesty, hospitality and serene approach to life | Sakshi
Sakshi News home page

నిజాయితీకి నిలువుటద్దం ఈ మనుషులు

Published Tue, Aug 2 2016 4:47 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

నిజాయితీకి నిలువుటద్దం ఈ మనుషులు - Sakshi

నిజాయితీకి నిలువుటద్దం ఈ మనుషులు

ఐజాల్‌: మిజోరం రాష్ట్రం ఎత్తైన పర్వతాలు, దట్టమైన అడువులు, పచ్చటి పొలాలు, జలపాతాలు, సెలయేళ్లతో అందమైన ప్రకతితో అలరారుతుంటోంది. ప్రకతిలాగే అక్కడే నివసించే మిజో ప్రజలు మనసు కూడా అంతే స్వచ్ఛమైనది. అంతే అందమైనది. నిజాయితీకే వాళ్లు నిలువటద్దం. రోజంతా పొలాల్లో కష్టపడి పనిచేసే వాళ్లు, పొద్దుపోయాక ఇల్లు చేరేవాళ్లు  జాతీయ రహదారి పక్కన తమ ఉత్పత్తులను అమ్ముకునేందుకు తాత్కాలిక బండ్లను ఏర్పాటు చేసుకున్నారు.

అయితే అక్కడ విక్రయించేవారు ఎవరూ ఉండరు. ఉత్పత్తులు, వాటి పక్కన ధరల పట్టిక, డబ్బులు వేసేందుకు చిన్న డబ్బాలు ఉంటాయి. దారినపోయే కస్టమర్లు తమకు కావాల్సిన వస్తువులను తీసుకొని ధరల పట్టిక ప్రకారం డబ్బులను పక్కనున్న డబ్బాల్లో వేయాలి. నోటు వేసి చిల్లర తీసుకోవాల్సి వస్తే కూడా వారు ఆ డబ్బాల నుంచే ఎవరికి వారు తీసుకోవాలి. ఈ వ్యవహారం సక్రమంగా జరుగుతుందా, లేదా చాటు నుంచి గమనించేందుకు కూడా అక్కడ ఎవరూ ఉండరు. కొద్దిపాటి అటవీ ఉత్పత్తులు, చిన్నపాటి వ్యవసాయంపై బతికే అక్కడి చిన్నకారు రైతులు కష్టమర్ల నిజాయితీ మీద బతుకుతున్నారు.

పొద్దస్తమానం అడవుల్లో, పొలాల్లో పనిచేసే ఆ చిన్నకారు రైతులు ఉదయం పొలాలకు వెళ్లేటప్పుడు తమ ఉత్పత్తులను అక్కడ అమర్చి పోతారు. ఇళ్లకు వెళ్లేటప్పుడు డబ్బులను తీసుకొని వెళతారు. తోటి మనిషి పట్ల వారికి అపార విశ్వాసం. తోటి మనిషుల పట్ల కరుణ చూపడం, ఔదార్యం ప్రదర్శించడం, వ్యక్తిగత స్వార్థం లేకపోవడం, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం వారికి పుట్టుకతో వచ్చిన నైజం. ఈ నైజాన్ని వారు తమ మిజో భాషలో ‘హామ్‌నింగాయినా’ అని పిలుస్తారు.

మిజోరమ్‌ రాజధాని ఐజాల్‌ నగరానికి 65 కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారి పక్కన సన్నకారు రైతుల తాత్కాలిక అమ్మకాల షేడ్లు ఉన్నాయి. వాటిలో వారు పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, అడవిలో దొరికే ఇతర ఆహార పదార్థాలు, స్వచ్ఛమైన సెలయేటి నీళ్లు విక్రయిస్తారు. తాము నిజంగా కస్టమర్ల నిజాయితీపైనే బతుకుతున్నామని, కొన్నేళ్ల నుంచి తమ ఉత్పత్తులను కాపలాలేకుండా విక్రయిస్తున్నా ఇంతవరకు ఎవరూ మోసం చేసిన దాఖలాలు లేవని వారిని కలిసిన మీడియాకు వారు వెల్లడించారు. కొన్నిసార్లు తాము సూచించిన ధరకన్నా ఎక్కువే డబ్బులు వచ్చాయని, ఆ డబ్బులను తాము బోనస్‌గా భావిస్తామని వారు చెప్పారు.

వ్యవసాయ పనులపై ఆధారపడి బతికే తాము ఉత్పత్తుల విక్రయం కోసం ఓ వ్యక్తిని పెట్టుకునే స్థోమత తమకు లేకపోవడం వల్లనే తాము ఈ తరుణోపాయాన్ని కనుగొన్నామని వారు చెప్పారు. తాము ఎన్నడూ మోసపోలేదుకనుక ఈ పద్ధతినే కొనసాగిస్తూ వస్తున్నామని తెలిపారు. ‘నిజాయితీకి పెద్దగా విలువలేని ఈ దేశంలో మిజోలు అంత నిజాయితీగా ఉన్నప్పుడు, వారిని గౌరవించాలనే ఉద్దేశంతోనే ఎప్పుడు వారిని మోసం చేయాలని అనిపించదు’ అని అటుగా వచ్చిన కస్టమర్లు మీడియాతో వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement