
ఏపీలో చట్టం.. అపహాస్యం
- మంత్రివర్గ విస్తరణలో నలుగురు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలకు చోటు
- ఫిరాయింపు ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించిన గవర్నర్
- వైఎస్సార్‌సీపీ తరఫున గెలిచి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయని ఫిరాయింపుదారులు
- అసెంబ్లీలో వారు ఇప్పటికీ వైఎస్సార్‌సీపీ సభ్యులుగానే కొనసాగుతున్నారని స్పీకర్ వెల్లడి
- ఫిరాయింపులను ప్రోత్సహించటమే తప్పు.. ఆపైన వారికి మంత్రి పదవులా..!
- చంద్రబాబు వైఖరిపై విమర్శల వెల్లువ.. మంత్రులుగా 11 మంది ప్రమాణం
సాక్షి, అమరావతి
చట్టం చట్టుబండలైంది. రాష్ట్ర గవర్నర్ సాక్షిగా పార్టీ ఫిరాయింపుల చట్టం అపహాస్యమైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన నలుగురు శాసనసభ్యులతో ఆదివారం వెలగపూడి సచివాలయ ప్రాంగణం వద్ద తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించడంపై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు, నిరసనలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వ తీరు పట్ల టీడీపీయేతర పక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఏ విలువలకీ ప్రస్తానం అంటూ మేధావి వర్గం ఆవేదన వ్యక్తం చేసింది. రాష్ట్ర చరిత్రలో ఇది బ్లాక్ డే అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ఇది రాజ్యాంగానికి, రాష్ట్రానికి ఘోరమైన అవమానం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒక పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి, ఆ పదవికి రాజీనామా చేయకుండానే మరో పార్టీలోకి ఫిరాయించిన వారికి మంత్రి పదవులెలా ఇస్తారని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు, నవ్యాంధ్ర పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కత్తి పద్మారావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆక్షేపించారు. తెలంగాణాలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడంపై లొల్లి చేసిన చంద్రబాబు.. ఆంధ్రప్రదేశ్‌లో ఆయనే ఆ తప్పు ఎందుకు చేశారని లోక్‌సత్తా ప్రశ్నించింది. సీఎం రాజ్యాంగ విలువలను మంట కలిపారని వైఎస్సార్‌సీపీ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తదితరులు నిప్పులు చెరిగారు.
గత ఎన్నికల్లో రావు వెంకట సుజయి కృష్ణ రంగారావు, చదిపిరాళ్ల ఆది నారాయణరెడ్డి, ఎన్ అమర్‌నాథ్‌రెడ్డి, భూమా అఖిలప్రియలు వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. అసెంబ్లీలో వీరు ఇప్పటికీ వైఎస్సార్‌సీపీ సభ్యులుగానే కొనసాగుతున్నారు. అసెంబ్లీ సమావేశాల ముగింపు రోజున స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు వైఎస్సార్‌సీపీ సభ్యులు 67 మంది అని ప్రకటించడమే ఇందుకు నిదర్శనం. పార్టీ ఫిరాయింపుదారులతో రాజీనామా చేయించి, తిరిగి ఎన్నికలు నిర్వహించకుండా ఏకంగా మంత్రి పదవులు కట్టబెట్టడాన్ని టీడీపీ నేతలు సైతం తప్పు పడుతున్నారు. రాజ్యాంగ విలువలను కాపాడాల్సిన గవర్నరే పార్టీ ఫిరాయింపుదారులతో మంత్రులుగా ప్రమాణం చేయించడం దారుణం అని జనం విస్తుపోతున్నారు.
మంత్రులుగా 11 మంది ప్రమాణ స్వీకారం
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కించుకున్న 11 మంది ఆదివారం ఉదయం 9.22 గంటలకు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వెలగపూడి సచివాలయ ప్రాంగణం వద్ద తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ వారితో ప్రమాణం చేయించారు. కిమిడి కళా వెంకట్రావు, ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేశ్, పితాని సత్యనారాయణ, నక్కా ఆనంద్‌బాబు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, రావు వెంకట సుజయకృష్ణ రంగారావు, కాల్వ శ్రీనివాసులు, చదిపిరాళ్ల ఆది నారాయణరెడ్డి, కొత్తపల్లి శామ్యూల్ జవహర్, ఎన్ అమర్‌నాథ్‌రెడ్డి, భూమా అఖిలప్రియ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆదినారాయణరెడ్డి, జవహర్, అఖిలప్రియలు పవిత్ర హృదయంతో అని, మిగతా వారు దైవసాక్షిగా అంటూ ప్రమాణం చేశారు. ప్రమాణం సమయంలో పితాని సత్యనారాయణ, అఖిలప్రియ కొద్దిగా తడబడ్డారు. లోకేష్ ప్రమాణం చేసిన తర్వాత తన తండ్రి చంద్రబాబు, గవర్నర్‌కు పాదాభివందనం చేశారు. నక్కా ఆనంద్‌బాబు, కాల్వ శ్రీనివాసులు, జవహర్‌లు సైతం ముఖ్యమంత్రి పాదాలకు నమస్కరించారు. కొత్త మంత్రుల్లో భూమా అఖిలప్రియ, జవహర్ మొదటిసారి ఎమ్మెల్యేలు కాగా, లోకేశ్ ఇటీవలే ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.
ప్రవేశ ద్వారం వద్ద గందరగోళం
ఉద్వాసనకు గురైన ఐదుగురు మంత్రుల్లో నలుగురు ప్రమాణ స్వీకారానికి గైర్హాజరయ్యారు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, రావెల కిషోర్‌బాబు, కిమిడి మృణాళిని, పల్లె రఘునాథ్‌రెడ్డి ఈ కార్యక్రమానికి దూరంగా ఉండగా పీతల సుజాత హాజరయ్యారు. వేదిక ముందు ప్రత్యేకంగా వేసిన సీట్లలో ముఖ్యమంత్రి సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్, వియ్యంకుడు బాలకృష్ణ, ఆయన భార్య వసుంధర కూర్చున్నారు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న వారి కుటుంబ సభ్యులు అక్కడికి రావాల్సి ఉన్నా రాలేకపోయారు. ప్రమాణ స్వీకారం కార్యక్రమం చూద్దామని వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు వెలగపూడి సచివాలయం వద్ద చుక్కలు కనిపించాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం ప్రాంగణానికి చేరుకోవడానికి అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. ప్రవేశ మార్గాలపై స్పష్టత లేక అందరూ ఒకవైపే రావడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. ఒక దశలో తొక్కిసలాట కూడా చోటుచేసుకుంది. దీంతో పోలీసులు అందరినీ అడ్డుకున్నారు.
చివరికి ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉన్న వారు సైతం లోనికి వెళ్లడానికి ఇబ్బందిపడ్డారు. ఒక దశలో ప్రమాణ స్వీకారానికి వెళుతున్న జవహర్‌ను.. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు వస్తున్నారంటూ పోలీసులు నిలిపివేశారు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులను సీట్లలో కూర్చోబెట్టిన తర్వాత ఆయన్ను వేదిక వద్దకు పంపారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు వేదికకు దగ్గరగా వెళ్లే అవకాశం లేక జనంలోనే ఉండిపోయారు. డీజీపీ సాంబశివరావు, విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్‌లు సైతం జనంలో చిక్కుకుని బయట పడడానికి ఇబ్బంది పడ్డారు. మీడియా సిబ్బంది తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. మీడియా గ్యాలరీ లేకపోవడంతో గందరగోళం నెలకొంది. ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి అందరికీ అల్పాహార విందు ఇచ్చారు. గవర్నర్, మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు విందుకు హాజరయ్యారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎన్టీఆర్, చంద్రబాబు కుటుంబ సభ్యులైన హరికృష్ణ, రామకృష్ణ, కళ్యాణ్‌రామ్, నారా రోహిత్ తదితరులు వచ్చారు.