‘బేటీ’ షాదీకి మోదీ అనూహ్య సాయం!
వారణాసి: ‘బేటీ పఢావో బేటీ బచావో’ (ఆడబిడ్డని చదివిద్దాం, ఆడబిడ్డను కాపాడుదాం) ఇది ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన నినాదం. కానీ, నల్లధనంపై సర్టికల్ స్ట్రైక్స్ చేస్తూ ఆయన పెద్దనోట్లను రద్దుచేయడంతో పెళ్లిళ్లపైనా ఆ ప్రభావం పడింది. పెళ్లిళ్లు కుదిరిన చాలామంది నవవధువులు మోదీ నిర్ణయంతో షాక్ తిన్నారు. పలువురు ఆడపిల్లల తండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ, ఒక ‘బేటీ’ మాత్రం అనూహ్య సాయాన్ని పొందింది.
వారణాసికి చెందిన జితేంద్ర సాహు నేతకార్మికుడు. పెద్దనోట్ల రద్దు నిర్ణయం ప్రకటించడంతో ఆయనకు అనుకోని కష్టాలు చుట్టుముట్టాయి. కొంతకాలం కిందటే ఉపాధిని కోల్పోయిన జితేంద్ర సాహు తన సంపాదనలో పదో పరకో కూడబెట్టి తన కూతురు పెళ్లికి సిద్ధమయ్యాడు. ఇలా పెళ్లికి అన్ని ఏర్పాట్లుచేసుకున్న తరుణంలో పెద్దనోట్లను రద్దుచేస్తున్నట్టు మోదీ ప్రకటించడంతో జితేంద్ర మీద పిడుగ పడ్డట్టయింది. దీంతో ఆయన కూతురు జ్యోతి సాహు ఈ నెల 9న ధైర్యంగా ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాసింది. తన పెళ్లికి సాయం చేయాలని కోరింది. తొమ్మిదిరోజుల తర్వాత ఊహించని ఘటన జరిగింది. స్థానిక జిల్లా అధికారి ఒకరు వారి ఇంటికి వచ్చి.. ఆ కుటుంబానికి రూ. 20వేలు ఇచ్చారు. దీంతో ఆమె పెళ్లి సజావుగా జరిగింది. జ్యోతి లేఖ చదివి ప్రధాని మోదీయే నేరుగా ఈ డబ్బు పంపించారని తర్వాత తెలియడంతో జితేంద్ర కుటుంబం ఆశ్చర్యపోయింది.