మీ చేతివేళ్లే.. మీ భవిష్యత్
Published Fri, Dec 30 2016 5:04 PM | Last Updated on Wed, Aug 15 2018 6:32 PM
మీ చేతి వేళ్లే మీ భవిష్యత్తుగా మారబోతున్నాయని భీమ్ యాప్ ఆవిష్కరణ సందర్భంగా ప్రధాని మోదీ అన్నారు. మీ చేతి వేళ్లతో సరికొత్త భారత్ను ఆవిష్కరించడని ప్రజలకు పిలుపునిచ్చారు.. రాబోయే రోజుల్లో ఆర్థిక లావాదేవీలకు మొబైల్స్, ఇంటర్నెట్ కూడా అవసరం లేదని, కేవలం వేలిముద్ర ద్వారానే లావాదేవీలు జరుపుకోవచ్చన్నారు. 'భీమ్ యాప్ సామాన్యమైనది కాదు. కేవలం ఐదు నిమిషాల్లో లావాదేవీలను పూర్తిచేస్తుంది. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్కు ఘన నివాళిగా ఈ యాప్ను ప్రారంభించాం. ఈ యాప్ మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆర్థిక నిపుణులుగా చేస్తుంది' అని మోదీ చెప్పారు.
మార్పు కోసం దేశం సిద్ధమైందని, టెక్నాలజీతో అనుసంధానమయ్యేందుకు సామాన్యుడు కూడా సిద్ధంగా ఉన్నాడని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఈవీఎంలు విప్లవాన్ని సృష్టించాయని గుర్తుచేశారు. డిజిటల్ చెల్లింపులతో దేశ స్వరూపమే మారబోతుందన్నారు. 'మూడేళ్ల క్రితం వరకు ఏ పత్రిక చూసిన స్కాంల గురించే మాట్లాడేది. ఇప్పుడు ఎంత వస్తుంది, ఏం లాభం జరుగుతుందనేది వినిపిస్తుంది. నిరాశవాదులకు ప్రత్యేకంగా చెప్పేదే లేదు. ఆశావాదులకు మాత్రం ప్రభుత్వం మరిన్ని అవకాశాలు కల్పించనుంది' అని పేర్కొన్నారు.
Advertisement