బాబు వద్దకు 'తమ్ముళ్ల పంచాయితీ'
- చంద్రబాబు వద్దకు చేరిన ‘పంచాయితీ’
- అందరినీ కలుపుకొని వెళ్లాలంటూఎమ్మెల్యే మోదుగులకు సీఎం సూచన
- జనచైతన్య యాత్రల్లోనూ ఎమ్మెల్యేకు అసమ్మతి సెగ
- డివిజన్ అధ్యక్షుల నియామకంలోనూ విభేదాలు
- కొత్త ముఖాలకు స్థానం కల్పిస్తున్నారంటూ నిరసనలు
గుంటూరు : నగరంలో తెలుగు తమ్ముళ్ల కుమ్ములాటలు తారస్థాయికి చేరుకున్నాయి. డివిజన్ అధ్యక్షుల ‘పంచాయితీ’ సీఎం వద్దకు చేరింది. తక్షణం విజయవాడ రావాలంటూ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పిలుపు రావడంతో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి తన కార్యక్రమాలను రద్దు చేసుకొని గురువారం మధ్యాహ్నం బయలుదేరి వెళ్లారు. పార్టీలో అసమ్మతి రాకుండా అందరినీ కలుపుకొని వెళ్లాలంటూ ఈ సందర్భంగా సీఎం సూచించినట్లు తెలుస్తోంది. మరోవైపు నగర టీడీపీలో జరుగుతున్న పరిణామాలపై కార్యకర్తలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి...
ఎమ్మెల్యే మోదుగులపై మాజీ కార్పొరేటర్లు, డివిజన్లలో కార్యకర్తలు, నాయకులు తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్నారు. పార్టీ చేపట్టిన జనచైతన్య యాత్రల్లో సైతం మోదుగులకు అసమ్మతి సెగ తగిలింది. అనేక సంవత్సరాలుగా పార్టీని నమ్ముకొని ఉన్న తమను పరిగణనలోకి తీసుకోకుండా కొత్త ముఖాలకు డివిజన్లలో కీలక బాధ్యతలు అప్పగించడంపై పార్టీ కార్యకర్తలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
పార్టీని నాశ నం చేయడమే లక్ష్యంగా ఎమ్మెల్యే మోదుగుల పనిచేస్తున్నారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇదే సమయంలో నియోజకవర్గంలో పార్టీ పటిష్టతతో పాటు రాబోయే కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి నుంచే పార్టీ విజయానికి డివిజన్లలో పట్టు నిలుపుకొనేందుకు మోదుగుల ప్రయత్నిస్తున్నారంటూ ఎమ్మెల్యే వర్గం వాదిస్తోంది.
చిచ్చురేపిన డివిజన్‌స్థాయి నియామకాలు ...
పశ్చిమ నియోజకవర్గం డివిజన్ అధ్యక్షులను నెల రోజులు క్రితం ఎమ్మెల్యే మోదుగుల ప్రకటించారు. మరోవైపు నగర అధ్యక్షులు బోనబోయిన శ్రీనివాస్‌యాదవ్ వారం రోజుల క్రితం నగర కమిటీని ప్రకటించారు. నియోజకవర్గ పరిధిలోని 6 డివిజన్లలో అధ్యక్షుల నియామకం బోనబోయిన, ఎమ్మెల్యేల మధ్య చిచ్చురేపింది. ముఖ్యంగా 42వ డివిజన్ అధ్యక్షునిగా గణేష్‌ను ఎమ్మెల్యే నియమించారు.
అయితే ఇక్కడ ఎప్పటి నుంచో మాజీ కార్పొరేటర్ ఎలుకా వీరాంజనేయులు అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన గణేష్‌ను డివిజన్ అధ్యక్షుడిగా ఎలా నియమిస్తారంటూ బుధవారం నల్లరిబ్బన్లతో కార్యకర్తలు నిరసన తెలిపారు. 30వ డివిజన్‌లో మాజీ కార్పొరేటర్ దాసరి జ్యోతి భర్త దాసరి రమణను కాదని వేరొకరికి అధ్యక్షునిగా ఇచ్చారు.
అలాగే 45వ డివిజన్‌లో మాజీ కార్పొరేటర్ మద్దిరాల మ్యానీని కాదని వేరొకరికి పదవిని కట్టబెట్టారు. అలాగే 44వ డివిజన్ అధ్యక్షునిగా ఆంజనేయులు పదేళ్ళుగా కొనసాగుతుండగా వేరొకరిని ఎంపిక చేశారు. ఇలా 42, 36, 32 డివిజన్లలో అధ్యక్షుల నియామకం పార్టీలో చిచ్చురేపింది.