కందిపప్పు కేజీ రూ. 85
నంద్యాల : కందిపప్పుల ధరలు ఆకాశాన్ని తాకడంతో వ్యాపారులు ఇదే అవకాశంగా తీసుకుని టాంజానియా కందిపప్పును మార్కెట్లోకి దిగుమతి చేసుకున్నారు. ఈ పప్పు కిలో రూ. 85 నుంచి రూ.90 మధ్యన విక్రయిస్తుండటంతో పేద, మధ్యతరగతి ప్రజలు ఈ పప్పును కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే స్థానిక కందపప్పు తినడానికి అలవాటు పడినవారు ఈ పప్పును తినలేరని వ్యాపారులు సైతం పేర్కొంటున్నారు. నిల్వ కూడా రెండుగంటల కంటే అధికంగా ఉండదని వివరిస్తున్నారు.
సందట్లో సడేమియ
హోటల్, మెస్ల యజమానులు విద్యార్థుల కోసం విద్యాసంస్థల్లో నిర్వహిస్తున్న హాస్టళ్లలో కూడా 75 శాతం మంది ఈ టాంజానియా పప్పునే వినియోగిస్తున్నట్లు సమాచారం.ఉప్పు, కారం, నూనె రుచి ముసుగులో వీటి నాణ్యత అంతగా తెలియదని హోటల్ నిర్వాహకులు చెబుతున్నారు. స్థానిక కందిపప్పు ధరలు పెరగక ముందు టాంజానియా కందిపప్పు కేవలం కేజీ రూ. 40 నుంచి రూ. 50 మధ్యన విక్రయించేవారమని చెప్పారు. కాగా కందిపప్పు ధర అమాంతంగా రూ. 210కి చేరడంతో... ఈ పప్పును మార్కెట్లోకి దిగుమతి చేసుకుని... కొనుగోలుదారులకు మరీ వివరించి.. విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.
టాంజానియా కందిపప్పు ను భారీ ఎత్తున విక్రయించి భారీగా లాభాలు గడించడానికి హైదరాబాద్ నుంచి కర్నూలు జిల్లాలోని నంద్యాల, ఆదోని, కర్నూలు ప్రాంతాలకు దళారులను రంగప్రవేశం చేయించి... సరుకు పంపుతున్నారు. ఈ వ్యవహారాన్ని అత్యంత గోప్యంగా కొనసాగిస్తున్నారు. అయితే ఈ పప్పు వాడకం వల్ల వచ్చే అనర్థాలపై అధికారులు ఎటువంటి అవగాహన లేకపోవడంతో వ్యాపారం యథేచ్చగా సాగుతోంది.