
వృద్ధి 5 శాతం పైనే: చిదంబరం
వాషింగ్టన్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు 3.75 శాతం మాత్రమే ఉండొచ్చన్న అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) అంచనాలను కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం తోసిపుచ్చారు. ఇవి పూర్తిగా నిరాశాపూరితమైనవి, వృద్ధి 5 శాతం పైగానే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. వర్షపాతం బాగుండటం వల్ల వ్యవసాయోత్పత్తి మెరుగ్గా ఉండటంతో పాటు ఏడాదిగా తీసుకుంటున్న సంస్కరణలు కూడా ఇందుకు దోహదపడగలవని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రభావాలన్నీ ద్వితీయార్థంలో కనిపించగలవన్నారు. అమెరికాకు చెందిన కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు పేర్కొన్నారు.
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల సంస్క రణలపై మాట్లాడుతూ, దేశానికి ఒక విధానం ఉంటుందని, సిసలైన ఇన్వెస్టర్లు దానికి లోబడే పనిచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
ఆర్థిక సంక్షోభం ఏమీ లేదు: రాజన్
కాగా భారత్ లో ఆర్థిక సంక్షోభ పరిస్థితులేమీ లేవని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ వాషిం గ్టన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో స్పష్టం చేశారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు తగినస్థాయి లో విదేశీ మారక నిల్వలు ఉన్నాయని, నిధుల కోసం మరో ఐదేళ్ల పాటు అసలు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) దగ్గరకు వెళ్లాల్సిన అవసరమే ఉండబోదని చెప్పారు. ఒకవేళ మరీ కష్టతరమైన పరిస్థితులు ఎదురైతే.. బంగారం రూపంలోనైనా అప్పులు తీర్చేయగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.