మరింత దూకుడు కొనసాగిస్తున్న రూపాయి
మరింత దూకుడు కొనసాగిస్తున్న రూపాయి
Published Wed, Mar 15 2017 12:53 PM | Last Updated on Tue, Sep 5 2017 6:10 AM
ముంబై : అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అద్భుత విజయం రూపాయికి భలే కిక్కిచ్చింది. డాలర్ తో పోలిస్తే తగ్గుతూ వచ్చిన రూపాయి మారకం విలువ నిన్నటి ట్రేడింగ్ లో ఒక్కసారిగా ఏడాదిన్నర గరిష్టానికి ఎగిసింది. నేటి ట్రేడింగ్ లోనూ ఈ రూపాయి విలువ మరింత పెరిగింది. విదేశీ క్యాపిటల్ ఇన్ఫ్లోస్ తో రూపాయి మరో 38 పైసలు బలపడి 65.44 వద్ద ట్రేడైంది. ఎంతో కీలక రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ఘన విజయం సాధించడంతో ఫైనాన్సియల్ మార్కెట్లలో సెంటిమెంట్ భారీగా బలపడింది. అంతేకాక సుస్థిర ప్రభుత్వం రూపాయికి బూస్ట్ ఇచ్చింది. డాలర్ పై దూకుడు కొనసాగిస్తూ రూపాయి మంగళవారం ఇంట్రాడేలో గరిష్ట స్థాయి 65.76ని తాకింది.
చివరికి 78 పైసలు బలపడి 1.17 శాతం పెరుగుదలతో 65.82 వద్ద ముగిసింది. నిన్నటి ముగింపుకు మరింత బలపడుతూ మార్నింగ్ ట్రేడ్ లో రూపాయి 65.41, 65.44 స్థాయిలో ట్రేడైంది. ప్రస్తుతం 32 పైసల లాభంతో 65.49 వద్ద ట్రేడవుతోంది.. ఇదే సమయంలో డాలర్ ఇండెక్స్ 0.06 శాతం కిందకి దిగజారింది. ఆరు కరెన్సీల బాస్కెట్ లో డాలర్ విలువ మార్నింగ్ ట్రేడ్ లో 101.68 వద్ద కొనసాగింది. మరోవైపు నేడు ఫెడరల్ రిజర్వు మీటింగ్ నిర్ణయం వెలువడనుంది. ఈ నేపథ్యంలో మార్కెట్లు మాత్రం ఫ్లాట్ గా ట్రేడవుతున్నాయి.
Advertisement