
ఈసీ ముంగిట్లో ‘సైకిల్’ పంచాయితీ
• ఎన్నికల సంఘాన్ని కలిసిన ములాయం వర్గం
• అధ్యక్షుడిగా అఖిలేశ్ ఎంపిక చట్ట విరుద్ధమని ఫిర్యాదు
• నేడు ఎన్నికల చీఫ్‌ను కలవనున్న అఖిలేశ్ వర్గం
• ఎటూ తేలని ‘గుర్తు’ వివాదం
న్యూఢిల్లీ: సమాజ్‌వాదీ పార్టీలో ‘గుర్తు’ వివాదం ఆసక్తికరంగా మారింది. పార్టీ స్థాపించినప్పటినుంచీ తనే అధ్యక్షుడిననీ.. పార్టీ గుర్తు తనకే చెందాలని ములాయం సింగ్ ఈసీకి విన్నవించగా.. మంగళవారం అఖిలేశ్ తరపున రాంగోపాల్ యాదవ్ తమ మద్దతుదారుల వివరాలు అందజేయనున్నారు. అయితే ఇరువర్గాల వాదనలను విన్నతర్వాతే గుర్తుపై నిర్ణయం ఉంటుందని ఈసీ తెలపటంతో పరిస్థితి ఆసక్తికరంగా మారింది. సోమవారం సాయంత్రం ములాయం సింగ్ నాయకత్వంలో శివ్‌పాల్, అమర్‌సింగ్, జయప్రద, తదితరుల బృందం కేంద్ర ఎన్నికల సంఘంతో సమావేశమై తమ వాదనలను వినిపించింది.
ప్రస్తుత జాతీయాధ్యక్షుడిని తనేనని పార్టీ ఎన్నికల గుర్తు ‘సైకిల్’ను మరెవరికీ కేటాయించకూడదని ములాయం ఈసీని కోరారు. ఆదివారం లక్నోలో జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం పూర్తిగా అనధికారమని, రాజ్యాంగ విరుద్దమని, పార్టీలో పూర్తి మద్దతు తమకే ఉందని ములాయం అధికారులకు వివరించారు. ఎస్పీ రాజ్యాంగం ప్రకారం.. పార్టీ అధ్యక్షుడి తొలగింపునకు పార్లమెంటరీ బోర్డుకే ఉందని.. కానీ అలాంటి భేటీ జరగకుండానే తనను తప్పించటం చట్టవిరుద్ధమన్నారు.
ఇప్పట్లో తేలటం కష్టమేనా?
తాజా వివాదం నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఎవరికి సైకిల్ గుర్తు కేటాయిస్తారనే దానిపై నిర్ణయించేందుకు నాలుగైదు నెలల సమయం పడుతుందని మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్‌వై ఖురేషీ తెలిపారు. ఈసీ కూడా అఖిలేశ్ వర్గం వాదన వినకుండా గుర్తుపై నిర్ణయం తీసుకోవటం సాధ్యం కాదని స్పష్టం చేసింది. దీంతో రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం సైకిల్ గుర్తును స్తంభింపజేయటమే ఈసీ ముందున్న మార్గమని రాజకీయ నిపుణులంటున్నారు.