అఖిలేశ్ వెన్నుపోటు?.. రగిలిపోతున్న ములాయం!
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ అనుకున్నది సాధించారు. ఒకవైపు పార్టీపై పూర్తి పట్టు సాధించడమే కాదు.. మరోవైపు తన బాబాయి శివ్‌పాల్ యాదవ్ వర్గానికి గట్టిగా చెక్ కూడా చెప్పారు. అంతేకాకుండా తన తండ్రి ములాయం అధీనంలో ఉన్న పార్టీ జాతీయ అధ్యక్ష పదవిని తన చేతుల్లోకి తీసుకున్నారు.
దాదాపు 5వేల మంది సమాజ్‌వాదీ పార్టీ నేతలు, కార్యకర్తలతో అత్యంత అట్టహాసంగా బహిరంగ సభ తరహాలో జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సదస్సులో అఖిలేశ్ పార్టీ చీఫ్‌గా పగ్గాలు చేపట్టారు. తండ్రి ములాయం ఇక నుంచి చీఫ్ మెంటర్ పాత్రను నిర్వహిస్తారని ప్రకటించారు. లక్నోలోని జానేశ్వర్ మిశ్రా పార్కు వేదికగా జరిగిన ఈ సభా ప్రాంగణం అఖిలేశ్ అనుకూల నినాదాలతో దద్దరిల్లింది. అఖిలేశ్ మద్దతుదారులైన ఎమ్మెల్యేలు, మంత్రులు, కీలక నేతలు పెద్ద ఎత్తున ఈ సదస్సుకు హాజరయ్యారు. సీఎం అఖిలేశ్ యాదవ్, రాంగోపాల్ యాదవ్‌తోపాటు ఎస్పీ సీనియర్ ఎంపీలు నరేశ్ అగర్వాల్, రేవతి రమణ్ సింగ్, మంత్రి అహ్మద్ హసన్ తదితరులు వేదికపై ఆసీనులయ్యారు.
తనను పార్టీ నుంచి ఆరేళ్లపాటు ములాయం బహిష్కరించిన నేపథ్యంలో శనివారమే అఖిలేశ్ తన బలప్రదర్శన నిరూపించుకున్న సంగతి తెలిసిందే. 200మందికిపైగా ఎమ్మెల్యేలు, సీనియర్ మంత్రులు, 35మంది ఎమ్మెల్సీలు అఖిలేశ్‌కు అండగా నిలిచారు. దాదాపు 30మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు మాత్రమే శివ్‌పాల్ వర్గం వైపు ఉన్నారు. ఈ నేపథ్యంలో అఖిలేశ్ బలప్రదర్శనతో దిగొచ్చిన ములాయం అఖిలేశ్‌పై, రాంగోపాల్ యాదవ్‌పై సస్పెన్షన్ ఎత్తివేసిన సంగతి తెలిసిందే.
దీంతో తండ్రి-కొడుకుల మధ్య విభేదాలు సమసిపోతుందని భావించారు. కానీ, అలా జరగలేదు. రాంగోపాల్ యాదవ్ పిలుపుమేరకు జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సదస్సులో ఏకంగా ములాయం కుర్చీకి అఖిలేశ్ ఎసరుపెట్టారు. ఇది బహిరంగ వెన్నుపోటేనని శివ్‌పాల్ వర్గం భావిస్తున్నది. శివ్‌పాల్ యాదవ్ వర్గానికి గట్టి మద్దతుగా ఉన్న ములాయం కూడా.. అఖిలేశ్ ధిక్కారంపై మండిపడుతున్నారు. ఈ భేటీ పార్టీ రాజ్యాంగానికి విరుద్ధమని, దీనికి హాజరైన వారికి చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అయినా, ఆయన ఆదేశాలను పార్టీలో ఎవరూ పట్టించుకున్నట్టు కనిపించడం లేదని, ఎస్పీలో మెజారిటీ నేతలు అఖిలేశ్ వైపే నిలిచారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.