మహిళలు మాట్లాడటమా.. వద్దు కూర్చో!
మహిళలు మాట్లాడటమా.. వద్దు కూర్చో!
Published Thu, Nov 17 2016 5:36 PM | Last Updated on Tue, Oct 16 2018 5:58 PM
ఆమె ఓ పార్టీ మహిళా విభాగానికి రాష్ట్ర అధ్యక్షురాలు. ఆ హోదాలోనే ఒక సమావేశానికి వెళ్లారు. అక్కడ మాట్లాడేందుకు సిద్ధం అవుతుండగా.. అదే పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆమెను ఆపేశారు. పార్టీలో మహిళలు పురుషులను ఉద్దేశించి మాట్లాడటం సంప్రదాయం కాదంటూ అడ్డుకున్నారు. ఇదంతా కేరళలోని ముస్లింలీగ్ పార్టీ వ్యవహారం. కమరున్నీసా అన్వర్ (60).. ఆ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు. తిరువనంతపురంలో జరిగిన ఓ బహిరంగ సభలో ఆమె కూడా పాల్గొన్నారు. ప్రసంగానికి లేచి నిలబడగానే పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎంసీ మయీన్ హాజీ ఆమెను అడ్డుకున్నారు. పురుషులను ఉద్దేశించి మహిళలు మాట్లాడటం సరికాదన్నారు. వాళ్లిద్దరి మధ్య జరిగిన సంభాషణల ఆడియోను గుర్తుతెలియని వ్యక్తులు లీక్ చేశారు.
అయితే, తాను అలా అనలేదని ఆ తర్వాత హాజీ ఖండించారు. ''మహిళలు బహిరంగ సభలలో మాట్లాడరు. మేము మహిళలకు పురుషుల కంటే ఎక్కువ గౌరవం ఇస్తాం. అందుకే వాళ్లను బహిరంగ సభలు, రాత్రివరకు జరిగే కార్యక్రమాలకు హాజరు కాకుండా ఆపుతాం'' అని ఆయన చెప్పారు. ఏదైనా ఒక బృందం వచ్చినప్పుడు వాళ్లతో మాట్లాడటానికి పర్వాలేదు గానీ, బహిరంగ సభలను ఉద్దేశించి మాట్లాడకూడదని తెలిపారు. అయితే.. తాను గత 20 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నానని, జరిగిన ఘటన పట్ల చాలా బాధపడుతున్నానని కమరున్నీసా అన్వర్ తెలిపారు. అయినా.. పార్టీ మీద మాత్రం తనకు ఎలాంటి ఫిర్యాదులు లేవన్నారు. కేరళ అసెంబ్లీలో మొత్తం 140 మంది సభ్యులుండగా, వారిలో కేవలం 8 మంది మాత్రమే మహిళలు. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక్క మహిళా ఎమ్మెల్యే కూడా లేరు. ఆ పార్టీ మిత్రపక్షమైన ముస్లింలీగ్‌కు 18 మంది ఎమ్మెల్యేలుండగా, వాళ్లలోనూ ఒక్కరూ మహిళలు లేరు.
Advertisement
Advertisement