గగనతలంలో విమానం అదృశ్యం
నెపైడా: 116 మందితో వెళుతున్న మయన్మార్ సైనిక విమానం గగనతలంలో అదృశ్యమైంది. దక్షిణాది నగరం మైయిక్, యాంగాన్ మధ్య బుధవారం కనిపించకుండాపోయిందని ఆర్మీ చీఫ్ కార్యాలయం వెల్లడించింది. మధ్యాహ్నం 1.35 గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా విమానంతో సంబంధాలు తెగిపోయాయని తెలిపింది. విమానం ఆచూకీ కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నట్టు పేర్కొంది. విమానంలో 105 మంది ప్రయాణికులు, 11 మంది సిబ్బంది ఉన్నట్టు సమాచారం.
విమానంలో ఉన్నవారందరూ సైనికుల కుటుంబ సభ్యులని తెలుస్తోంది. సాంకేతిక లోపమే విమానం అదృశ్యానికి కారణమని, వాతావరణం బాగానే ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. విమానం అదృశ్యమైనప్పుడు అండమాన్ సముద్రంపై ప్రయాణించింది. దీంతో అండమాన్ సముద్రంలో గాలింపు చేపట్టారు. ఓడలు, విమానాలను రంగంలోకి దింపారు.