
'కట్టప్ప మృతి వెనుక ఆ సంస్థ హస్తం'
బెంగళూరు: 'టిప్పు సుల్తాన్' వివాదంలో తనను చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని మైసూర్-కొడగు బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా పోలీసులకు ఫిర్యాదు చేశారు. టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలను వ్యతిరేకించడంతో తనను చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయని మైసూరు పోలీసు కమిషనర్ దయానంద్ కు తెలిపారు.
మైసూర్ హులీ షాహిద్ మిలాత్ మహాన్ టిప్పు సుల్తాన్ ఇండియన్ ముస్లిం అనే సంస్థ ఫేస్ బుక్ లో తనను హెచ్చరించిందని వెల్లడించారు. తన ఫొటోపాటు టిప్పు సుల్తాన్ జయంతి వేడుకల సందర్భంగా చెలరేగిన హింసాకాండలో మృతి చెందిన వీహెచ్ పీ నేత కట్టప్ప ఫొటోను ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశారని పోలీసులకు తెలిపారు. అయితే కట్టప్ప మృతి వెనుక ఈ సంస్థ హస్తం ఉందన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రతాప్ సింహా ఫిర్యాదును విజయానగర్ పోలీస్ స్టేషన్ లో నమోదు చేశారు. ఆయన ఇంటివద్ద పోలీసు భద్రత పెంచారు.
కాగా, కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి టిప్పు సుల్తాన్ పేరు పెట్టాలని డిమాండ్ చేసినందుకు తనను చంపుతామంటూ బెదిరింపులు వస్తున్నాయని గిరీశ్ కర్నాడ్ తెలిపారు. టిప్పు జయంతిని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించడంతో ఘర్షణలు ప్రారంభమయ్యాయి. కొడుగు జిల్లా మడికేరిలో తిమ్మయ్య సర్కిల్ వద్ద జరిగిన ఇరువర్గాల ఘర్షణలో వీహెచ్‌పీ కొడగు జిల్లా ముఖ్యకార్యదర్శి కట్టప్ప(60) మీతి చెందారు. ఈ నేపథ్యంలో శుక్రవారం కర్ణాటక బంద్ కు వీహెచ్‌పీ పిలుపునిచ్చింది.