
‘నాగం’పై పార్టీలో చర్చిస్తాం : కిషన్ రెడ్డి
నాగం జనార్ధన్ రెడ్డి చేపట్టిన బచావో తెలంగాణ మిషన్‌కు పార్టీ అనుమతి లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి చెప్పారు.
ఆయన ‘మిషన్’కు అనుమతి లేదు
సాక్షి, హైదరాబాద్: నాగం జనార్ధన్ రెడ్డి చేపట్టిన బచావో తెలంగాణ మిషన్‌కు పార్టీ అనుమతి లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ పార్టీ అనుమతి లేకుండా చేపట్టిన కార్యక్రమాలపై అంతర్గత సమావేశాల్లో చర్చిస్తామన్నారు. అయితే ప్రజల పక్షాన కార్యక్రమాలు చేపట్టడాన్ని స్వాగతిస్తామన్నారు. నాగం పార్టీలోనే ఉన్నారని, పార్టీ కార్యక్రమాలకు పిలుస్తామని వెల్లడించారు.
బీజేపీ ఉద్యమించడం లేదనడం సరికాదని, ఈ ఏడాది సంస్థాగత సంవత్సరంగా ప్రకటన చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటులో అనుసరించిన తీరును వివరిస్తూ ఆ పార్టీ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో కేంద్రమంత్రులు, ఎంపీలు ఈ నెల 25, 26 తేదీల్లో పర్యటిస్తారని వెల్లడించారు. ఈ నెల 23న పార్టీ నేతలతో కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి సమావేశం అవుతారని కిషన్ రెడ్డి వివరించారు. అలాగే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులతో కేంద్ర పంచాయతీరాజ్ మంత్రి సమావేశం అవుతారని వెల్లడించారు. ఈ నెల చివరి వారంలో మహబూబ్‌నగర్ జిల్లా నుంచి ఉద్యమబాట పడుతున్నామని ప్రకటించారు.