
'వారు నా కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ'
హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నా కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్లో టీడీపీ కేంద్ర కమిటీ అధ్యక్షుడిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ... కార్యకర్తలను పూర్తిగా ఆదుకున్న పార్టీ టీడీపీ అని తెలిపారు. దేశంలోనే అత్యధికంగా సభ్యత్వాలు నమోదు చేసిన పార్టీ కూడా టీడీపీయే అని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు.
తెలుగు జాతి ఆత్మగౌరవం కోసమే ఎన్టీఆర్ పార్టీ పెట్టారన్నారు. టీడీపీ నిర్మాణంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అహర్నిశలు కష్టపడ్డారని చెప్పారు. ఎన్టీఆర్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి అని చంద్రబాబు కీర్తించారు. తెలుగు వారి భవిష్యత్తు కోసమే ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్నామని చంద్రబాబు వెల్లడించారు. అలాగే కొత్త, పాత కలయికతో కమిటీని టీడీపీ కేంద్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కమిటీలను నియమించామని చంద్రబాబు చెప్పారు.