మోడీకి దీటైన ప్రధాని అభ్యర్థి లేరు: వెంకయ్య
చెన్నై: దేశంలోని ఏ రాజకీయ పార్టీలోనూ నరేంద్రమోడీకి దీటైన ప్రధాని అభ్యర్థి లేరని, 2014 లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ కేంద్రంలో అధికారాన్ని కైవసం చేసుకునే స్థాయిలో మ్యాజిక్ ఫిగర్ సాధించడం ఖాయమని బీజేపీ సీనియర్ నేత ఎం.వెంకయ్యనాయుడు ఉద్ఘాటించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇందిరాగాంధీ కాలంనాటి ఎమర్జెన్సీ కంటే ఘోరంగా తయారైందని విమర్శించారు.
ఇటీవలి 4రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే ఈ విషయం రుజువైందన్నారు. ఈ మేరకు ఇక్కడి పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. కాంగ్రెస్ తన ఓటు బ్యాంకుగా భావించే ఎస్సీ, ఎస్టీలు ఇప్పుడాపార్టీకి దూరమయ్యూరని వెంకయ్యనాయుడు ఎద్దేవా చేశారు. ముస్లింలు సైతం బీజేపీకి అండగా నిలిచారన్నారు. ఎన్నికల్లో లబ్ధికోసం కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రవేశ పెట్టిన ఆధార్ కార్డులు, నగదు బదిలీ, ఆహార భద్రత పథకాలు 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీని కాపాడలేవని జోస్యం చెప్పారు.
‘అవినీతి నిర్మూలన కోసం ఏర్పాటైన సీబీఐ కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌గా మారిపోలేదా?. కాంగ్రెస్ ప్రయోజనాల కోసం వైఎస్ జగన్ విషయంలో సీబీఐని వాడుకోలేదా?’ అని ప్రశ్నించారు. తెలంగాణ విషయంలో కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజలకు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సోనియా బహుమతి అని, సీమాంధ్ర వారికి బీజేపీ కారణంగానే రాష్ట్రాన్ని విభజిస్తున్నామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని విమర్శించారు.