అభివృద్ధిపై చర్చకు రండి.. ప్రధానికి మోడీ సవాలు
బీజేపీ తనను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించకముందే గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ చెలరేగిపోయారు. దమ్ముంటే సుపరిపాలన, అభివృద్ధి విషయంలో చర్చకు రావాలని ప్రధాని మన్మోహన్ సింగ్ను సవాలు చేశారు. జాతీయ భద్రత విషయంలో తీవ్రంగా మండిపడ్డారు. పాకిస్థాన్, చైనా ఎంత రెచ్చగొడుతున్నా భారతదేశం ఏమాత్రం స్పందించకపోవడం పట్ల ప్రధానిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి నుంచి కాంగ్రెస్ మానసపుత్రిక ఆహారభద్రత బిల్లు వరకు అన్ని అంశాలపైనా దుమ్ము దులిపేశారు. యావద్దేశం తన ప్రసంగాన్ని ప్రధాని ప్రసంగంతో పోల్చి చూసుకుంటుందని నిన్ననే చెప్పిన మోడీ.. అనుకున్నట్లే తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. పదే పదే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రసంగంలోని అంశాలను ఆయన ప్రస్తావించారు.
సహనానికి కూడా హద్దుంటుందని రాష్ట్రపతి అన్నారని.. ఆ హద్దు ఏంటని మోడీ ప్రశ్నించారు. సరిహద్దు రేఖ ఎక్కడుందో ఢిల్లీలోని ప్రభుత్వమే నిర్ణయించాలన్నారు. ఎంతకాలం సహనంతో ఉంటామని నిలదీశారు. కేవలం పాకిస్థాన్ మాత్రమే కాదని, జాతీయ భద్రత కూడా ప్రమాదంలో ఉందని మోడీ చెప్పారు. చైనీయులు మన భూభాగంలోకి వస్తున్నా మనం మాత్రం నోరు మెదపట్లేదని, ఇటాలియన్ సైనికులు వచ్చి మన మత్స్యకారులను చంపేసినా, పాకిస్థానీలు మనవాళ్ల తలలు నరుక్కెళ్లినా పట్టించుకోవట్లేదంటూ భుజ్ వేదికపై నిప్పులు కురిపించారు.
ప్రధాని ఇచ్చిన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో పాకిస్థాన్కు గట్టి హెచ్చరిక ఏమీ లేదంటూనే... ప్రధానమంత్రి పదవిలో ఉన్నప్పుడు పొరుగు దేశాలతో సత్సంబంధాలు నెలకొల్పాల్సిన అవసరం ఉంటుందని తెలుసన్నారు. పాకిస్థాన్ను సవాలు చేయడానికి ఎర్రకోట వేదిక కాదని, అయినా భారత సైన్యం నైతిక బలాన్ని మాత్రం పెంచి తీరాలని చెప్పారు. పలు అంశాల్లో మోడీ ప్రధానిపై విరుచుకుపడ్డారు.
దేశం మార్పు కోసం అవిశ్రాంతంగా ఎదురు చూస్తోందని ఆయన తెలిపారు. జవాన్ల
నైతిక బలాన్ని పెంపొందించేందుకు ప్రధాని ఏదో ఒకటి చేయాలని, కానీ అది మాత్రం జరగట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రపతి తన ప్రసంగంలో వ్యక్తం చేసిన ఆవేదనను తానూ పంచుకుంటున్నట్లు మోడీ తెలిపారు. సుపరిపాలన, అభివృద్ధి అంశాలపై దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని ప్రధానమంత్రిని మోడీ సవాలుచేశారు. 'మీరు పెద్ద దేశాన్ని పాలిస్తున్నారు, నేను చిన్న రాష్ట్రాన్ని పాలిస్తున్నా. అభివృద్ధి, సుపరిపాలన అంశాలపై ప్రధాని దమ్ముంటే చర్చకు రావాలి. ఢిల్లీ సర్కారుకు, గుజరాత్కు మధ్య పోటీ జరగాలి' అని ఆయన అన్నారు.
ఎర్రకోటపై పతాకాన్ని ఎగరేసే అవకాశం చాలా ఎక్కువసార్లు వచ్చినా, తొలి ప్రధాని నెహ్రూ ఏం చెప్పారో ఇప్పటికీ అదే చెబుతున్నారంటూ ఎద్దేవా చేశారు. గడిచిన 60 ఏళ్లుగా ఏం చేశారని ప్రశ్నించారు. దేశంలో ఆర్థిక సంస్కరణల గురించి చెప్పేటపుడు పీవీ నరసింహారావును ప్రస్తావిస్తున్నారని, కానీ ఇప్పుడు మన రూపాయి విలువ దిగజారిపోడానికి కారణం ఎవరని ప్రశ్నించారు. ఇలాంటి సమయంలో ఏ చర్యలు తీసుకోవాలంటూ నిలదీశారు.
చివరిగా అవినీతిపై ప్రణబ్ ముఖర్జీ వ్యక్తం చేసిన ఆవేదనను మోడీ ప్రస్తావించారు. ఆయనలాగే ప్రధాని కూడా ఈ అంశంపై మాట్లాడి ఉంటే బాగుండేదన్నారు. రాష్ట్రపతి భావనలు, ఆయన ఆవేదనను పట్టించుకోవాలని ప్రధానికి సూచించారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం ఎందుకు ప్రారంభించలేమని అడిగారు. తనకు రాజకీయాలు మాట్లాడటం ఇష్టం లేకపోయినా, అవినీతి మాత్రం దేశం ముందున్న అతిపెద్ద సమస్య అని అన్నారు. గతంలో మామా అల్లుళ్ల అవినీతిపై టీవీలో సీరియళ్లు వచ్చేవని, ఇప్పుడు అత్తా కోడళ్లు, అల్లుళ్ల అవినీతి గురించి కథలు కథలుగా వస్తున్నాయంటూ పరోక్షంగా రాబర్ట్ వాద్రా వ్యవహారాన్ని ప్రస్తావించారు. దేశాన్ని పాలించేవాళ్ల కుటుంబాలు పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయాయన్నారు.