మన్మోహన్‌ను విమర్శించిన మోదీ..అందులోనూ ఫస్టేనా? | is narendra modi mute prime minister | Sakshi
Sakshi News home page

మౌనంలోనూ మోదీ ఫస్టే!

Published Wed, Jan 10 2018 6:40 PM | Last Updated on Wed, Aug 15 2018 2:32 PM

is narendra modi mute prime minister - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : చాలా విషయాల్లో తానే మొదటి వ్యక్తిని అని చెప్పుకునేందుకు తాపత్రయ పడే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, మరో విషయంలో నిజంగా మొదటి వ్యక్తి అయినప్పటికీ చెప్పుకోవడం మరచిపోయినట్టున్నారు. ఆయన ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించి మూడున్నర ఏళ్లు గడచి పోయినప్పటికీ ఇంతవరకు ఒక్క విలేకర్ల సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయలేదు. ఆయన పార్టీ నాయకుడు అటల్‌ బిహార్‌ వాజపేయితోపాటు దేశానికి ప్రధానిగా బాధ్యతలు నిర్వహించిన వారంతా విలేకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేసిన వారే. ఆయన మౌన ప్రధానిగా ఎద్దేవా చేసినా మన్మోహన్‌ సింగ్‌ కూడా ఏడాదికి రెండు సార్లు విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు.

ప్రధానిగా మోదీకి మరో 16 నెలలు పదవీకాలం ఉన్నప్పటికీ భవిష్యత్తులోనైనా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేస్తారన్న నమ్మకం లేదు. తాను చెప్పింది వినాలిగానీ, ఎదురు ప్రశ్నించడం నరేంద్ర మోదీకి నచ్చదని కొంత మంది మనస్తత్వ శాస్త్రవేత్తలు ఆయన మనస్తత్వాన్ని ఇప్పటికే విశ్లేషించి చెప్పారు. అంటే విలేకరుల సమావేశంలో ఎదురు ప్రశ్నలు ఉంటాయికనుకనే ఆయన విలేకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేయడం లేదని స్పష్టం అవుతోంది. అందుకనే ఆయన తన పట్ల విధేయత చూపుతున్న రెండు టీవీ ఛానళ్లను ఎంపిక చేసుకొని ఇంటర్వ్యూలు మాత్రం ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ముందుగా తాను ఎంపిక చేసుకున్న ప్రశ్నలే ఉన్నాయి.

ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలతో ముఖాముఖి సంబంధాలు ఉండాలికనుక ట్విట్టర్, నమో ఆప్, రేడియోలో ‘మన్‌ కీ బాత్‌’ ద్వారా ప్రజలతో టచ్‌లో ఉంటున్నారు. కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి స్మతి ఇరానీ, హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌లు ఇదివరకు విలేకరుల సమావేశాలను తరచుగా ఏర్పాటు చేసేవారు. ఇప్పుడు వారు కూడా అందుకు జంకుతున్నారు. ప్రధాని కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకే వారు కూడా విలేకర్లను దూరంగా ఉంచుతున్నారని తెల్సింది. గతంలో పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్నప్పుడు సెంట్రల్‌ హాల్లో కేంద్ర మంత్రులు, విపక్ష నేతలు విలేకరులకు అందుబాటులో ఉండేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మోదీ నియమించుకున్న గుజరాత్‌కు చెందిన ఆయన సహాయకుడొకరు పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌ గేటు వద్ద కాపు కాస్తాడు. ఏ జర్నలిస్ట్‌ ఎవరి కోసం వచ్చాడో ఎంక్వైరీ చేస్తారు. ఆరోజు ఏ మంత్రి ఎక్కడ విలేకరులతో మాట్లాడుతాడో చెబుతారు. ఆ అధికారి అనుమతి ఉంటే తప్ప విలేకరులతో మాట్లాడేందుకు అవకాశం లేకుండా పోయిందని ఓ సీనియర్‌ మంత్రియే విలేకరుల ముందు వాపోయిన సందర్భమూ ఉంది.

నరేంద్ర మోదీ తనకు విధేయులుగా ఉండడం కోసం కీలకమైన పదవుల్లో గుజరాత్‌కు చెందిన వారినే ఎక్కువ మందిని నియమించుకున్న విషయం తెల్సిందే. ఎప్పటికప్పుడు ప్రెస్‌కు బ్రీఫింగ్‌ ఇవ్వడం కోసం మన్మోహన్‌ సింగ్‌ వరకు ప్రధానికి ‘ప్రెస్‌ అడ్వైజర్‌’గా  ఒకరిని నియమించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ పదవిలో సీనియర్‌ జర్నలిస్ట్‌నుగానీ, అధికారినిగానీ నియమిస్తారు. ఈ సంప్రదాయానికి కూడా నరేంద్ర మోదీ తిలోదకాలిచ్చారు. గుజరాత్‌ మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు కూడా మోదీ మీడియాను దూరంగానే ఉంచేవారని, ఏ మంత్రి నుంచి ఎలాంటి సమాచారం అందేది కాదని గుజరాత్‌ మీడియా మిత్రులు తెలియజేశారు.

ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించిన సమాచారం కోసం విడివిడిగా వివిధ మంత్రిత్వ శాఖలకు, అధికార విభాగాలకు ఆర్టీఐ కింద పిటిషన్లు దాఖలు చేసుకోవడం, అక్కడి నుంచి సమాధానం వచ్చే అవకాశం గతంలో ఉండేది. ఇప్పుడు అలాకాదు. అన్ని ఆర్టీఐ దరఖాస్తులను పీఎంవోకు పంపించాల్సిందే. ఇదివరకు (కాంగ్రెస్‌ హయాంలో) పీఎంవో కార్యాలయం పది శాతం దరఖాస్తులను తిరస్కరిస్తే ఇప్పుడు 80 శాతం దరఖాస్తులను తిరస్కరిస్తోంది. ఎదురులేని చక్రవర్తిగా వ్యవహరించే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తరచుగా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంటే మోదీ ఒక్క విలేకరుల సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయకపోవడం ఏ మార్కు ప్రజాస్వామ్యం అనుకోవాలి ? ఇప్పుడు నిజమైన మౌని ప్రధాని ఎవరు?

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement