
కేంద్ర పథకాలకు సత్యార్థి సహకారం
ప్రధాని మోదీతో భేటీ అయిన నోబెల్ విజేత
న్యూఢిల్లీ: నోబెల్ శాంతి బహుమతి విజేత కైలాష్ సత్యార్థి కుటుంబ సభ్యులతో కలసి శనివారం ఢిల్లీలో ప్రధాని మోదీని కలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ్ భారత్, సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన పథకాలకు తన సహకారం అందిస్తానని ఈ సందర్భంగా సత్యార్థి ఆసక్తి వ్యక్తం చేశారు. తప్పిపోయిన చిన్నారులను గుర్తించేందుకు తాను సోషల్ మీడియా, ఇంటర్నెట్‌ను ఎలా వినియోగించుకున్నదీ ప్రధానికి వివరించారు. బాల కార్మికులు లేని దేశంగా భారత్‌ను మార్చేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. నోబెల్ అవార్డుకు ఎంపికైన సత్యార్థికి ప్రధాని ఈ సందర్బంగా శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు ఆయన ప్రయత్నాలు ఫలించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. అలాగే, ప్రపంచంలో తొలి చిన్నారుల యూనివర్సిటీని గాంధీనగర్‌లో ఏర్పాటు చేసిన విషయాన్ని ప్రధాని ప్రస్తావించారు.
ఈ మేరకు ప్రధాని కార్యాలయం ప్రకటన జారీ చేసింది. వీరి భేటీ ఫొటోను మోదీ ట్విట్టర్ ఖాతాలోనూ ఉంచారు. నోబెల్ శాంతి పురస్కారానికి సత్యార్థి, మలాలా సంయుక్తంగా ఎంపికైన విషయం తెలిసిందే. సత్యార్థి నోబెల్ పురస్కారానికి ఎంపికవడం దేశానికి గర్వకారణంగా పేర్కొంటూ మోదీ శుక్రవారమే ట్విట్టర్ ద్వారా స్పందించారు.