
నిజమే.. మంచిరోజులొస్తున్నాయి: నరేంద్రమోడీ
కాంగ్రెస్ పార్టీని, యూపీఏ ప్రభుత్వాన్ని విమర్శించే ఏ అవకాశాన్ని వదులుకోని బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ సీఎం నరేంద్రమోడీ గురువారం ప్రధాని మన్మోహన్‌సింగ్‌పై తన వాగ్బాణాలను గురిపెట్టారు.
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీని, యూపీఏ ప్రభుత్వాన్ని విమర్శించే ఏ అవకాశాన్ని వదులుకోని బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ సీఎం నరేంద్రమోడీ గురువారం ప్రధాని మన్మోహన్‌సింగ్‌పై తన వాగ్బాణాలను గురిపెట్టారు. 12వ ప్రవాస భారతీయుల దివస్’ కార్యక్రమంలో బుధవారం ప్రధాని ప్రసంగిస్తూ.. ‘దేశ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. మంచిరోజులు ముందున్నాయి’ అంటూ చేసిన వ్యాఖ్యలను తమకనుకూలంగా మోడీ మలుచుకున్నారు.
అదే కార్యక్రమంలో గురువారం ప్రసంగించిన మోడీ.. ప్ర ధాని వ్యాఖ్యలకు స్పందనగా ‘నిన్న ప్రధాని ఒక మంచి మాట చెప్పారు. దేశానికి మంచిరోజులు ముందున్నాయన్న ఆయన వ్యాఖ్యలతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను’ అని.. సభికుల స్పందన కోసం కాసేపాగారు. ఈలోగా ఆయన ఉద్దేశాన్ని గ్రహించిన సభ చప్పట్లు, నవ్వులతో మార్మోగింది. అవి ఆగిన తరువాత మళ్లీ తన ప్రసంగాన్ని చిరునవ్వుతో ప్రారంభించిన మోడీ.. ‘ఇంతకన్నా నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఆ మంచిరోజులు రావడానికి మరో ఐదారు నెలలు ఎదురుచూడాల్సి ఉంటుంది. మంచిరోజులు మాత్రం కచ్చితంగా రానున్నాయి’ అన్నారు. మరో 4 నెలల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని, దాంతో దేశానికి మంచిరోజులు రానున్నాయని అన్యాపదేశంగా ప్రస్తావిస్తూ మోడీ పై వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రసంగానికి ఆద్యంతం సభికుల నుంచి మంచి స్పందన లభించింది. మోడీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..
ఎన్‌ఆర్‌ఐలకు పిలుపు: దేశంలో సానుకూల మార్పు కో సం మీరూ కృషి చేయాలి. పెట్టుబడుల గురించి ఆలోచించకుండా మీ అనుభవాన్ని దేశాభ్యుదయానికి వాడాలి. ఎన్నికలప్పుడు మళ్లీ వచ్చి మీ ఓటుహక్కును వినియోగించుకుని ఈ విప్లవంలో పాలుపంచుకోండి.
యూపీఏపై నిప్పులు: ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం, వరుస కుంభకోణాలు, విధాన లేమి, స్వార్థ విభజన రాజకీయాలు.. వీటితో ప్రజలకు ప్రభుత్వంపై, నాయకులపై నమ్మకం పోయింది.
చారిత్రక ఘట్టాలు: చరిత్రలో రెండు ఘట్టాలను దగ్గర నుంచి చూశా. 1975లో ఎమర్జెన్సీ సమయంలో అంద రి భాగస్వామ్యంతో దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధర ణ జరిగింది. రెండోది.. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు అణు పరీక్షల నేపథ్యంలో ప్రపంచ దేశాల వ్యతి రేకత ఎదుర్కొన్నప్పుడు దేశం ఒక శక్తిగా నిలిచింది. ఇక మూడో ఘట్టం ముందుంది.. 2014 ఎన్నికల్లో దేశా న్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లడానికి ప్రజలు, విదేశాల్లోని భారతీయులు భాగస్వాములవుతారని విశ్వసిస్తున్నాను.
విద్యతోనే స్వర్ణయుగం: ప్రణబ్
విద్యతోనే దేశానికి మరో స్వర్ణయుగం సాధ్యమవుతుందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. ప్రవాస భారతీయ దినోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ప్రపంచంలోని అగ్ర దేశాల సరసన భారత్ ఎంత త్వరగా చేరగలదనే దానిని విద్య మాత్రమే నిర్ధారిస్తుందని అన్నారు.