పాక్ గురించి నాడు మోదీ ఏమన్నారు? | Narendra modi is impractical words on Pakistan terrorism activities | Sakshi
Sakshi News home page

పాక్ గురించి నాడు మోదీ ఏమన్నారు?

Published Thu, Sep 22 2016 5:30 PM | Last Updated on Sat, Mar 23 2019 8:28 PM

పాక్ గురించి నాడు మోదీ ఏమన్నారు? - Sakshi

పాక్ గురించి నాడు మోదీ ఏమన్నారు?

న్యూఢిల్లీ: కశ్మీర్‌లోని ఉడి సైనిక స్థావరంపై పాక్ టెర్రరిస్టులు జరిపిన దాడి నేపథ్యంలో పాకిస్థాన్‌పై భారత్ బాంబులు కురిపిస్తుందా? పాక్ భూభాగంలోకి చొచ్చుకుపోయి లక్షిత టెర్రరిస్టు శిబిరాలను పేల్చి వేస్తుందా? వ్యూహాత్మక దాడులు జరుపుతుందా? వాస్తవాధీన రేఖ వద్ద నుంచి నిర్దిష్ట కాల పరిమితిగల యుద్ధం చేస్తుందా? లేదా అంతర్జాతీయ సమాజం ముందు పాక్ గుడ్డలూడదీసి దోషిగా నిలబెడుతుందా? అదే సమయంలో ఎప్పటిలాగే దౌత్యపరమైన యుద్ధం కొనసాగిస్తుందా? అన్న ప్రశ్నలు అన్ని వర్గాల్లో తలెత్తాయి.

 ఈ ప్రశ్నలను కాసేపు పక్కన పెడితే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి పాకిస్థాన్ పట్ల వ్యక్తిగతంగా ఎలాంటి అభిప్రాయాలున్నాయో ఒక్కసారి పరిశీలించాల్సిన అవసరం ఉంది. పాకిస్థాన్ పక్కలో ఉన్న శత్రు దేశమని, అబద్ధాలు ఆడడంలో అది ఆరితేరిన దేశమని టీవీ జర్నలిస్ట్ రజత్ శర్మకు 2011లో ఇచ్చిన ఇంటర్వ్యూలో నరేంద్ర మోదీ స్పష్టంగా చెప్పారు. ముంబైపై 26-11 దాడులు జరిగినప్పుడే పాకిస్థాన్‌కు సైనిక దళాలను పంపించి ఉండాల్సిందని, తనకే అధికారం ఉంటే కచ్చితంగా అదే పని చేశేవాడినని ఆయన అన్నారు. పాక్ దాడులకు తెగబడినప్పుడల్లా అమెరికా వద్దకు పరుగెత్తుకెళ్లడం ఏమిటీ? అని కూడా కేంద్రం వైఖరిని హేళన చేశారు.  ఇప్పటికైనా పాకిస్థాన్‌కు ప్రేమలేఖలు రాయడాన్ని ఆపండంటూ అప్పటి యూపీఏ ప్రభుత్వాన్ని ఆయన గట్టిగా విమర్శించారు.

 ఇప్పుడు తన నాయకత్వంలోనే కేంద్ర ప్రభుత్వం నడుస్తున్నప్పుడు నరేంద్ర మోదీ ఎందుకు పాక్ పట్ల కఠిన వైఖరిని అవలంభించలేక పోతున్నారు? ప్రేమ లేఖలు ఆపమని చెప్పిన పెద్ద మనిషి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇంట్లో జరిగిన పెళ్లికి వెళ్లొచ్చి మెత్తపడ్డారా? ప్రజల్లో తలెత్తుతున్న ప్రశ్నలను ఆయన ఎలా అర్థం చేసుకుంటున్నారు? పాక్‌తో ఇప్పుడు సంప్రదాయక యుద్ధం చేయలేమని, అందుకు ఇది సమయం కాదని రక్షణ వర్గాలు నరేంద్ర మోదీకి స్పష్టం చేసినట్లు సమాచారం. అలా అని పాక్ భూభాగంలోకి చొచ్చుకుపోయి నిర్దిష్ట టెర్రరిస్టు శిబిరాలను ధ్వంసం చేసే శక్తి సామర్థ్యాలు కూడా మన రక్షణ రంగానికి లేవని కూడా తేల్చారట. అన్ని అంశాలను పరిశీలించాక ఎప్పటిలాగే దౌత్యపరమైన యుద్ధం కొనసాగించాలనే నిర్ణయానికి మోదీ వచ్చారని వినికిడి.

 భారత్, పాక్‌లు రెండుగా చీలిపోయిన నాటి నుంచి దౌత్య యుద్ధం చేస్తున్నాంగదా? ఇంకెంతకాలం అలాంటి యుద్ధం చేస్తాం? అప్పటికైనా లేదా ఎప్పటికైనా పాకిస్థాన్ దారికి వస్తుందన్న విశ్వాసం ఉందా? కశ్మీర్  సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు చిత్తశుద్ధి ఎలాగు లేదు. అది భారత్ అంతర్గత సమస్యని సరిపెడుతున్నప్పుడు పాకిస్థాన్ ముష్కర మూకలను అణచివేయడంలోనైనా చిత్తశుద్ధి చూపాలికదా? ఇంతవరకు చేస్తున్న దౌత్య యుద్ధం కూడా పక్కా వ్యూహంతో జరగలేదని చరిత్రనే తెలియజేస్తోంది. ఒకప్పుడు పాకిస్థాన్‌ను అమెరికా లాంటి పాశ్చాత్య దేశాలతోపాటు పలు ఇస్లామిక్ దేశాలు వెనకేసుకు వచ్చేవి. ప్రస్తుతం చైనా మినహా మరో దేశం పాక్ పక్షాన నిలబడే అవకాశమే లేదు. ఈ మారిన ప్రపంచ పరిస్థితుల్లో పాక్ పట్ల మన పంథా కూడా మారాలికదా!
- ఓ సెక్యులరిస్ట్ కామెంట్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement