
పాములకు నో ఎంట్రీ
పనాజీ: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఇటీవల గోవాలో పాల్గొన్న ర్యాలీకి ఊహించని ముప్పు ఎదురైంది. బీహార్ రాజధాని పాట్నాలో బాంబు పేలుళ్ల సంఘటన అనంతరం నరేంద్ర మోడీకి, ఆయన పాల్గొనే బహిరంగ సభలకు అసాధారణ భద్రత కల్పిస్తున్నారు. కాగా గోవాలో మాత్రం పాముల నుంచి రక్షణ కల్పించారట. ఈ విషయాన్ని గోవా ముఖ్యమంత్రి మనోమర్ పారికర్ వెల్లడించారు.
గత నెలలో పనాజీ సమీపంలోని మెర్సెస్ గ్రామంలో జరిగిన సభలో మోడీ పాల్గొన్నారు. దాదాపు లక్షమందికి పైగా జనం హాజరయ్యారు. ఆ సమయంలో బహిరంగ సభలోకి పాములు రాకుండా ప్రత్యేక భద్రత చర్యలు తీసుకున్నారు. రక్షణగా నిపుణులను మోహరించారు. ఆ సమయంలో బొరియల్లో నుంచి రెండు పాములు బయటకు రానే వచ్చాయి. వెంటనే వాటిని పట్టుకుని దూరంగా విడిచిపెట్టారు. ఆ ప్రాంతంలో పాములు ఎక్కువగా ఉండటంతో ముందు జాగ్రత్తగా భద్రత చర్యలు తీసుకున్నట్టు పారికర్ చెప్పారు.