ఆర్మీ ఆపరేషన్ పై నేతలు ఏమన్నారంటే
Published Thu, Sep 29 2016 6:10 PM | Last Updated on Mon, Sep 4 2017 3:31 PM
భారత ఆర్మీ గురువారం తెల్లవారుజామున పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లో ఉగ్రవాదుల స్ధావరాలపై చేసిన దాడులపై నిర్వహించిన అఖిలపక్ష సమావేశం అనంతరం పలు పార్టీల నేతలు మీడియాతో మాట్లాడారు. ఆర్మీ పీఓకేలో చేసిన సునిశిత దాడి(సర్జికల్ స్ట్రైక్) గురించి కేంద్ర ప్రభుత్వం తమకు పూర్తిగా వివరించిందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు గులాం నబీ ఆజాద్ తెలిపారు.
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రభుత్వ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని తాము స్వాగతిస్తామని పేర్కొన్నారు. ఇండియన్ ఆర్మీ చేసిన మెరుపు దాడి పాక్ ను దెబ్బకు దెబ్బ కొట్టడమేనని కాంగ్రెస్ నేత శశి థరూర్ అన్నారు. ఆర్మీ చేసిన దాడి మిలటరీ ఆపరేషన్ కాదని ఉగ్రవాద వ్యతిరేక దాడి అని సమాచార, ప్రసారాల శాఖ మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్ పేర్కొన్నారు.
నియంత్రణ రేఖ వద్ద నిర్దేశిత దాడులను(సర్జికల్ అటాక్స్) నిర్వహించిన ఆర్మీను, ప్రధానమంత్రి నరేంద్రమోదీని కేంద్రమంత్రి నరేంద్రసింగ్ తోమర్ అభినందించారు. ఆర్మీ దేశభక్తి, సాహసాలను కీర్తించారు. గురువారం భారత ఆర్మీ దాడితో భవిష్యత్తు ఉగ్రదాడులను భారత్ సహించబోదని పాకిస్తాన్ కు బోధపడిందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. నిర్దేశిత దాడుల గురించి పాక్ చేసిన కామెంట్లపై మీడియా అడిగిన ప్రశ్నలకు స్పందించిన ఆయన అంతకంటే ఏం చెప్పుకుంటారని అన్నారు.
అఖిలపక్ష సమావేశానికి అధ్యక్షత వహించిన కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ దాడులపై వరుస ట్వీట్లు చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఆర్మీ చక్కని పోరాటం చేసిందని కొనియాడారు. భారత వ్యతిరేకశక్తుల పీచమణచడంలో ఆర్మీ తిరుగులేని ధైర్య,సాహసాలను ప్రదర్శించిందని అన్నారు. సరైన సమయంలో చక్కని నిర్ణయం తీసుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వాన్ని కూడా ఆయన ట్వట్టర్ ద్వారా అభినందించారు.
దాడులపై మాట్లాడిన సీపీఐ నేత ఏచూరి సీతారం ఆర్మీ దాడిని పార్టీ సమర్ధిస్తున్నట్లు చెప్పారు. బలగాలను ఉపయోగించడం సరైన నిర్ణయం కాదనేది తన అభిప్రాయమని తెలిపారు. చర్చల ద్వారా మాత్రమే శాంతి సాధ్యమని, ఇరుదేశాల మధ్య సంప్రదింపులు మొదలవ్వాలని ఆకాంక్షించారు.
భారతీయ ఆర్మీ పాకిస్తాన్ కు గట్టి జవాబు ఇచ్చిందని, ఆర్మీ తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధిస్తున్నట్లు మాజీ రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోని చెప్పారు. ఇది కేవలం సునిశిత దాడి మాత్రమే కాదని పాకిస్తాన్ కు భారత్ ఇచ్చిన వార్నింగ్ అని చత్తీస్ ఘడ్ సీఎం రామన్ సింగ్ పేర్కొన్నారు. భవిష్యత్తులో ఉగ్రదాడులను సహించేది లేదని చెప్పారు.
Advertisement
Advertisement