ఏపీ మంత్రులను ఏకిపారేశారు.. | National media fire on stampede in rajahmundry | Sakshi
Sakshi News home page

ఏపీ మంత్రులను ఏకిపారేశారు..

Published Sat, Jul 18 2015 11:32 AM | Last Updated on Sun, Sep 3 2017 5:45 AM

ఏపీ మంత్రులను ఏకిపారేశారు..

ఏపీ మంత్రులను ఏకిపారేశారు..

న్యూఢిల్లీ : తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పుష్కర ఘాట్లో తొక్కిసలాట దుర్ఘటనపై జాతీయ టీవీ ఛానళ్లు ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వాన్ని ఏకిపారేస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబసమేతంగా వీవీఐపీ ఘాట్‌కి బదులు...పబ్లిక్‌ ఘాట్‌లో స్నానాలు ఆచరించడం వల్లే 29 మంది చనిపోయారని టైమ్స్‌ నౌ ఛానెల్‌.... ఐటీశాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డిని నిలదీసింది. ఈ సందర్భంగా యాంకర్ అడిగిన ఈ ప్రశ్నకు... సమాధానం చెప్పలేక మంత్రి పల్లె నానా తంటాలు పడ్డారు.

మున్సిపల్, పరిపాలన శాఖ మంత్రి నారాయణకు కూడా టైమ్స్ నౌ ఛానల్ తలంటింది. రాజమండ్రి తొక్కిసలాటకు కారణం మీ ముఖ్యమంత్రి కాదా అని టైమ్స్‌ నౌ ఛానెల్‌ యాంకర్ అర్నాబ్ గోస్వామి ప్రశ్నించగా...సమాధానం చెప్పేందుకు నారాయణ మాటలెతుక్కున్నారు. బదులివ్వలేక, విషయం చెప్పలేక తిప్పలు పడ్డారు.

కాగా గోదావరి నిత్యహారతికి పబ్లిసిటీ రాలేదన్న అసంతృప్తితో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుష్కరాలకు అంతర్జాతీయ ప్రచారం కావాలనుకున్నారు. ఇందుకోసం ఎంత ఖర్చయినా ఫర్వాలేదని అధికారులకు నిర్దేశించారు. అంతే ఆయన మాటకు తగ్గట్టుగా అంతర్జాతీయ ఛానల్తో ఒప్పందం చేసుకున్నారు.

గోదావరి పుష్కరాల్లో షార్ట్ ఫిల్మ్ కోసం నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. 64 లక్షల రూపాయలు చెల్లించేందుకు అంగీకరించింది. ఇందులో 30 లక్షలు ప్రొడక్షన్ కాస్ట్. మరో 19 లక్షలు డిజిటలైజేషన్, 8 లక్షలు ప్రమోషన్ మిగిలినవి ఇతర ఖర్చులు. ఈ మేరకు ఫైల్ కూడా ఏపీ సబివాలయంలో ప్రస్తుతం సర్క్యులేట్ అవుతోంది.

ఇక గోదావరి  పుష్కరాల ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీఐపీ ఘాట్ వదిలి సామాన్య భక్తులుండే పుష్కర ఘాట్కు రావడానికి ఈ షార్ట్ ఫిల్మ్ కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సీఎం కుటుంబ పుష్కర స్నానం, పిండ ప్రదాన క్రతువులు చేసినప్పుడు జనం భారీగా ఉంటే బావుంటుందన్న ఉద్దేశంతో అక్కడికి వచ్చారు. ఈ షూటింగ్ అదే సమయంలో జరిగింది.

సీఎం అక్కడే రెండు గంటలు ఉండటంతో జనాన్ని పూర్తిగా నియంత్రించేశారు. సీఎం పూజల అనంతరం జనాన్ని ఒక్కసారిగా వదిలిపెట్టేసరికి తొక్కిసలాట సంభవించింది. ఫలితంగా పెను విషాదం చోటుచేసుకుంది.  దీంతో 27 మంది ప్రాణాలు పోయాయి. ప్రభుత్వానికి అంతర్జాతీయ ప్రచారం మాటెలా ఉన్నా చంద్రబాబు ప్రభుత్వానికి రావాల్సినంత చెడ్డ పేరు వచ్చింది. ఒక పబ్లిసిటీ ఫిల్మ్‌ కోసం ఇంతమంది ప్రాణాలను బలిపెట్టడం ఏంటని విపక్షాలు మండిపడుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement