
సీతాకోక.. రెక్కలు విచ్చుకునే వేళ..
అప్పుడే పట్టుగూడును బద్దలుకొట్టుకుని బయటి ప్రపంచంలోకి వచ్చిన అందాల సీతాకోక చిలుక.. రెక్కలు విప్పుకొని గాలిలోకి ఎగిరిపోయే సుందర దృశ్యాన్ని ఎప్పుడైనా చూశారా? పోనీ రంగురంగుల బుల్లి సీతాకోకను స్వయంగా మీ చేతులతో గాలిలోకి వదిలిపెట్టారా? కోల్‌కతాలోని ఓ పార్కుకు వెళితే ఈ రెండూ అనుభవంలోకి వస్తాయి. జస్ట్ రూ.50 ఫీజు చెల్లిస్తే చాలు.. పట్టుగూడు(కకూన్)ను బద్దలుకొట్టుకుని సీతాకోక బయటికి రావడాన్ని చూడటమే కాదు.. అప్పుడే పుట్టిన ఆ బుల్లి సీతాకోకను గాలిలోకి విడిచిపెడుతూ ఫొటో కూడా తీసుకోవచ్చు. సీతాకోకల సంరక్షణ కోసమని ‘నేచర్ మేట్స్-నేచర్ క్లబ్’ అనే ఎన్‌జీవో వలంటీర్లు ఈ కొత్త కార్యక్రమం ప్రారంభించారు.
పట్టణాల్లో సీతాకోకల సంఖ్యను పెంచే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని నేచర్ మేట్స్ కార్యదర్శి అర్జన్ బసు రాయ్ వెల్లడించారు. విద్యార్థులకు సీతాకోక జీవితచక్రంలోని దశల అభివృద్ధి గురించి కూడా తాము అవగాహన కల్పిస్తామన్నారు.