10 మంది మంత్రులకు ఉద్వాసన
భువనేశ్వర్: అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తన మంత్రివర్గంలో భారీ మార్పులు చేశారు. కేబినెట్‌ను పునర్‌వ్యవస్థీకరించి కొత్తగా 10 మందికి చోటు కల్పించారు. 10 మందికి ఉద్వాసన పలికారు. రాజ్‌భవన్‌లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఎస్ సీ జమీర్ 12 మందితో మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించారు. వీరిలో ఆరుగురు మంత్రులుగా, నలుగురు సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు.
ఇద్దరు సిట్టింగ్ సహాయక మంత్రులు ప్రపుల్ల మాలిక్, రమేశ్ చంద్రలకు కేబినెట్ మినిస్టర్లుగా పదోన్నతి కల్పించారు. సూర్యనారాయణ్ పాత్రో, నిరంజన్ పూజారి, ప్రఫుల్ల సామాల్, మహేశ్వర్ మొహంతి, శశిభూషణ్ బెహెరా, ప్రతాప్ జెనా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. నృసింగ చరణ్‌సాహు, అనంత దాస్, సుశాంత్ సింగ్, చంద్రసారధి బెహెరా సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు.
ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన నాలుగేళ్ల తర్వాత తొలిసారిగా నవీన్ పట్నాయక్ తన కేబినెట్‌ను పునర్‌వ్యవస్థీకరించారు. ప్రజలకు మరింత మెరుగ్గా సేవలందించేందుకు ఈ పునర్వ్యవస్థీకరణ చేపట్టామని ఆయన తెలిపారు. సహకరించిన మంత్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.