
పశ్చిమ కనుమల్లో నక్సల్స్ పాగా!
దక్షిణాది రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ హెచ్చరిక
న్యూఢిల్లీ: నక్సలైట్లు దక్షిణ భారతదేశంలో కొత్త ప్రాంతానికి విస్తరించే ప్రయత్నం చేస్తున్నారని.. పశ్చిమ కనుమల్లోను, తమిళనాడు, కేరళ, కర్ణాటకలు కలిసే ప్రాంతంలోనూ సాయుధ కార్యకర్తల కదలికలు కనిపిస్తున్నాయని.. ఇది ఆ మూడు రాష్ట్రాలకూ భద్రతా పరంగా తీవ్ర ముప్పుగా పరిణమించనుందని కేంద్ర హోంశాఖ అంతర్గత నివేదికలో హెచ్చరించింది! ‘మావోయిస్టు పార్టీ సంస్థాగత పునాదిని విస్తరించుకునే దిశగా చేస్తున్న ప్రయత్నాలు విస్పష్టంగా కనిపిస్తున్నాయి. పశ్చిమ కనుమలు, మూడు దక్షిణాది రాష్ట్రాల కూడలిలో సాయుధ కార్యకర్తల కదలికలతో పాటు.. ఆ పార్టీ ప్రజా సంఘాల కార్యకలాపాలు గణనీయంగా పెరిగాయి. ఇది ఆందోళనకరం’ అని హోంశాఖ పేర్కొంది.
అయితే.. పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికతో నక్సలైట్ల ప్రయత్నాలను ఈ దశలోనే సులభంగా అడ్డుకోవచ్చని చెప్పింది. ‘ఈ ఏడాది ఇప్పటివరకూ కేరళలోని మలప్పురం, వాయానంద్, కన్నూర్ జిల్లాల్లో; కర్ణాటకలోని మైసూర్, కొడగు, ఉడిపి, చిక్‌మంగ్‌ళూర్, షిమోగా జిల్లాల్లో సాయుధ మావోయిస్టుల కదలికల ఘటనలు పాతికకు పైగా గుర్తించటం జరిగింది. పొరుగున ఉన్న తమిళనాడులో సాయుధ నక్సలైట్ల కదలికలు ఏవీ కనిపించనప్పటికీ.. ఈరోడ్ జిల్లాలో ఆ పార్టీ ప్రజా సంఘాల కార్యకలాపాలు పెరిగాయి’ అని వివరించింది. ఈ మూడు రాష్ట్రాలు కలిసే కూడలిలో పటిష్ట నిఘా ఉంచాలని, నక్సలైట్ల కార్యకలాపాలను ఆదిలోనే అడ్డుకునేందుకు పూర్తిస్థాయిలో కృషి చేయాలని ఆయా రాష్ట్రాల పోలీసు శాఖలకు కేంద్ర హోంశాఖ సూచించింది.