
కమల దళానికే పట్నా పీఠం!
బిహార్ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందన్న ఎన్‌డీటీవీ ఎగ్జిట్ పోల్
♦ ఎన్‌డీఏకు 125, మహాకూటమికి 110 సీట్లు వస్తాయని అంచనా
న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్‌డీఏ మెజారిటీ సాధించి అధికారం సొంతం చేసుకుంటుందని తన ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడైనట్లు ఆంగ్ల వార్తా చానల్ ఎన్‌డీటీవీ ప్రకటించింది. అక్టోబర్ 12న మొదలై నవంబర్ 5 వరకూ ఐదు దశలుగా సాగిన ఎన్నికలపై నిర్వహించిన ఫలితాలను ఎన్‌డీటీవీ శుక్రవారం ప్రసారం చేసింది. రాష్ట్రంలోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లో విపక్ష ఎన్‌డీఏ 125 సీట్లు కైవసం చేసుకుంటుందని అంచనా వేసింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న జేడీయూ సారథ్యంలోని ఆర్‌జేడీ, కాంగ్రెస్‌లతో కూడిన మహాకూటమి 110 సీట్లు సాధించి విపక్షంలోకి వెళుతుందని పేర్కొంది.
ఐదు దశల ఎన్నికల్లో తొలి దశ, చివరి దశ ఎన్నికలు జరిగిన సీట్లలోనే మహాకూటమికి.. ఎన్‌డీఏ కన్నా స్వల్పంగా ఎక్కువ సీట్లు వస్తాయని.. మధ్యలో గల మూడు దశల్లోనూ ఎన్‌డీఏకే అధిక సీట్లు వస్తాయని తేలినట్లు వివరించింది. అయితే.. గురువారం జరిగిన తుది దశ ఎన్నికల్లోనే రెండు కూటముల తల రాతలు మారిపోయినట్లు పేర్కొంది. ముస్లింలు, ఓబీసీలు అధికంగా గల సీమాంచల్, మిథిలాంచల్ ప్రాంతాల్లో మొదటి నాలుగు దశలకన్నా అధికంగా రికార్డు స్థాయిలో 60 శాతం పోలింగ్ నమోదైన విషయం తెలిసిందే.
ఈ ఐదో దశలో ఎన్నికలు జరిగిన 57 స్థానాల్లో మహాకూటమి తన సిట్టింగ్ స్థానాలను 17 కోల్పోతే.. ఎన్‌డీఏ 20 స్థానాలను అధికంగా గెలుచుకోనుందని ఎన్‌డీటీవీ వివరించింది. మొత్తం మీద.. మహాకూటమి కన్నా 15 సీట్లు అధికంగా సాధించి ఎన్‌డీఏ అధికారంలోకి వస్తుందని అంచనా వేసింది. రాష్ట్రంలోని 243 నియోజకవర్గాల నుంచి 76,000 మందిని సర్వే చేసి ఈ ఫలితాలను క్రోడీకరించినట్లు తెలిపింది.