మ్యాగీ వివాదం: కోర్టుకెక్కిన నెస్లె
ఆరోగ్య సమస్యలు సృష్టిస్తుందన్న ఆందోళనతో.. మార్కెట్లలో బ్రహ్మాండంగా అమ్ముడవుతున్న తమ 'మ్యాగీ' నూడుల్స్ను వెనక్కి రప్పించాలంటూ ఆహార భద్రతా నియంత్రణ సంస్థ ఇచ్చిన ఉత్తర్వులను సవాలుచేస్తూ నెస్లె కంపెనీ బాంబే హైకోర్టును ఆశ్రయించింది. మహారాష్ట్రకు చెందిన ఎఫ్డీఏ ఇచ్చిన ఉత్తర్వులపై కూడా ఈ కంపెనీ కోర్టుకు వెళ్తోంది.
అయితే తాము మార్కెట్ల నుంచి మ్యాగీ ఉత్పత్తులను వెనక్కి తీసుకుంటున్నామని, దానికి.. కోర్టుకు వెళ్లడానికి ఎలాంటి సంబంధం లేదని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. బాంబే హైకోర్టు ఇచ్చే ఉత్తర్వులను బట్టి తామేం చెయ్యాలో నిర్ణయించుకుంటామన్నారు. నూడుల్స్లో అనుమతించిన పరిమితి కంటే ఎక్కువ పరిమాణంలో సీసం, ఎంఎస్జీ అనే పదార్థాలు ఉండటంతో పలు రాష్ట్రాలు మ్యాగీ అమ్మకాలను నిషేధించిన విషయం తెలిసిందే.