కోట్లకు కోట్లు పట్టుబడుతున్న కొత్త కరెన్సీ
కొత్త నోట్ల కోసం ఏటీఎంల వద్ద, బ్యాంకుల వద్ద రాత్రింబవళ్లు వేచిచూస్తున్న సాధారణ ప్రజానీకానికేమో నగదు దొరకడం లేదు గానీ.. కొంతమంది దగ్గరైతే ఏకంగా కోట్లకు కోట్లు కొత్త కరెన్సీ నోట్లు బయటపడుతున్నాయి. పాత నోట్ల రద్దు అనంతరం జరిగిన పరిణామాలతో కొత్త కరెన్సీ నోట్ల జారీలో పలు అక్రమాలు జరిగినట్టు సీబీఐ విచారణ, ఐటీ తనిఖీల్లో వెల్లడవుతోంది. శుక్రవారం చెన్నైలో జరిగిన ఐటీ రైడ్స్లో పాత కరెన్సీ నోట్లు రూ.96.89 కోట్లు పట్టుబడగా.. కొత్త రూ.2000 కరెన్సీ నోట్లు రూ.9.63 కోట్లు బయటపడ్డాయి. ఈ నోట్లను ఆర్థికమంత్రిత్వ శాఖ రికవరీ చేసుకుంది. చెన్నైలోనే నిన్న జరిగిన ఐటీ దాడుల్లో రూ.36.29 కోట్ల విలువైన సుమారు 127 కేజీల బంగారాన్ని అధికారులు గుర్తించిన సంగతి తెలిసిందే. బంగారంతో పాటు రూ.70 కోట్ల కొత్త రూ.2వేల నోట్లను ఆర్థికమంత్రిత్వశాఖ స్వాధీనం చేసుకుంది.
చెన్నై నగరంలో మొత్తం 8 చోట్ల ఏకకాలంలో నిన్న ఐటీ దాడులు నిర్వహించింది. వీటిలో ఇంకా నాలుగు ప్రాంతాల్లో ఐటీ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. మరోవైపు సూరత్లో రూ.76 లక్షల కొత్త కరెన్సీ నోట్లు పట్టుబడ్డాయి. మహారాష్ట్ర రిజిస్ట్రర్డ్ హోండా సిటీ కారులో కొత్త రూ.2000నోట్లు 3,800 నోట్లను పట్టుకెళ్తుండగా పోలీసులు అడ్డగించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కారులో ప్రయాణిస్తున్న నలుగురిని సూరత్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో ఓ మహిళ కూడా ఉంది. ఇటు కర్ణాటకలోనూ ఆదాయపు పన్ను డిపార్ట్మెంట్ ముమ్మరంగా దాడులు నిర్వహిస్తోంది. హుబ్లీలో ఉన్న హ్యాండ్లూమ్ సెంటర్ అండ్ జువెల్లరీ స్టోర్లో ఐటీ దాడి చేసింది.