
100 కోట్లు - కొత్త పార్టీ !
ఎన్నికల్లో తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలు ఏం ఆలోచిస్తారు? అవకాశముంటే మంత్రి పదవి దక్కాలని, కుదరకపోతే కార్పొరేషన్ లేదా ఇతర అధికార పదవుల్లో కొనసాగాలని ఆశపడతారు. కానీ కరీంనగర్ జిల్లాలో ఓ ఎమ్మెల్యే మాత్రం అవేవీ తనకు వద్దనీ, భవిష్యత్తులో తానే కొత్త పార్టీ పెట్టి అధికారంలోకి వస్తాననీ చెబుతున్నారట! అధికారంలోకి వచ్చిన తరువాత తానే ఇతరులకు మంత్రి పదవులు ఇస్తానని కూడా సన్నిహితులకు ఆశపెడుతున్నారట. అనుకున్నదే తడవుగా ‘రూ.100 కోట్లు-కొత్త పార్టీ’ లక్ష్యంగా వసూళ్ల పర్వానికీ తెరదీశారట. సొంత పార్టీ కార్యకర్తలు, నాయకులని కూడా చూడకుండా తన దగ్గరకు పనుల కోసం వచ్చే వారందరి దగ్గర ఒక్కో పనికి ఒక్కో రేటు వసూలు చేస్తున్నారట. సదరు ఎమ్మెల్యే వ్యవహారం నచ్చని కొందరు నాయకులు ఈ విషయాన్నిసీఎం దృష్టికి కూడా తీసుకెళ్లారట.
ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా పార్టీ కార్యకర్తలు చెప్పిందంతా నిజమేనని తెలుసుకున్న సీఎం ఆ ఎమ్మెల్యేను పిలిపించి ‘తీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవు’ అంటూ తలంటుపోశారట. దాంతో ఎమ్మెల్యే వ్యవహారంలో మార్పు వస్తుందని ఆ పార్టీ నాయకులు భావించినా ఆ ఎమ్మెల్యే మాత్రం ‘లైట్’గా తీసుకున్నారట. ‘రాబోయే ఎన్నికల నాటికి ఫలానా ఐపీఎస్ అధికారి, ఫలానా సామాజికవర్గ ఉద్యమకారుడితో కలిసి నేనే కొత్త పార్టీ పెట్టబోతున్నా. అప్పటి వరకు రూ.100 కోట్లు పోగేసుకుంటా. ఎవరేం చేస్తారో చూస్తా’ అంటూ మరింత రెచ్చిపోతున్నారట. ఇదంతా దగ్గరుండి గమనిస్తున్న సన్నిహితులు ‘మా ఎమ్మెల్యేకు ఇదేం పోయేకాలం’ అంటూ గుసగుసలాడుతున్నారు.