త్వరలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటాం
ఎన్నికల్లో తమకు తగిలిన షాక్ నుంచి సమాజ్‌వాదీ పార్టీ ఇంకా కోలుకున్నట్లు లేదు. పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి కొత్త నాయకుడిని సెప్టెంబర్ 30వ తేదీలోగా ఎన్నుకుంటామని యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకుని మరీ ఎన్నికల్లో పోరాడినా బీజేపీ చేతిలో చావుదెబ్బ తినడానికి ప్రధాన కారణం యాదవ్ కుటుంబంలో చెలరేగిన అంతర్యుద్ధమేనని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన తండ్రి ములాయం సింగ్ యాదవ్ నుంచి గతంలో పార్టీ జాతీయాధ్యక్ష పదవిని లాగేసుకున్న అఖిలేష్.. ఆ తర్వాత మాత్రం మళ్లీ వెళ్లి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. బాబాయ్ శివపాల్ యాదవ్‌కు, మరదలు అపర్ణా యాదవ్‌కు టికెట్ ఇచ్చి తండ్రిని చల్లబరిచే ప్రయత్నం చేశారు. వాళ్లిద్దరిలో అపర్ణ ఓడిపోగా.. శివపాల్ గెలిచారు. అప్పట్లో ఎంతో ఉత్సాహంగా జాతీయాధ్యక్ష పదవి చేపట్టిన అఖిలేష్.. ఇప్పుడు దాన్ని ఎవరికిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
శనివారం నాడు మీడియాతో మాట్లాడిన అఖిలేష్ యాదవ్.. త్వరలోనే పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఇక ఉత్తరప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మీద అఖిలేష్ విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి అధికార నివాసం అయిన 5 కాళిదాస్ మార్గ్‌ను శుద్ధి చేస్తారని వార్తలు రావడంతో.. తాము మళ్లీ 2022 సంవత్సరంలో అధికారం చేపట్టినప్పుడు అగ్నిమాపక యంత్రాల సాయంతో గంగాజలం చల్లుతామని, అప్పుడు కేవలం 5 కాళిదాస్ మార్గ్‌లోనే కాక.. మొత్తం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో చల్లుతామని అన్నారు. ఇప్పుడు కూడా రాష్ట్రవ్యాప్తంగా అల్లర్లు జరుగుతున్నాయని, అయితే వాటిని మీడియాలో చూపించడం లేదని చెప్పారు. గతంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు తనమీద బురద చల్లేవారన్నారు.