నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ మళ్లీ రికార్డు సృష్టించింది. తొలిసారి 9200 మార్కును చేధించింది.
రికార్డులు బద్దలు కొడుతున్న నిఫ్టీ
Published Fri, Mar 17 2017 10:04 AM | Last Updated on Tue, Sep 5 2017 6:21 AM
ముంబై : నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ మళ్లీ రికార్డు సృష్టించింది. తొలిసారి 9200 మార్కును చేధించింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయంతో దూకుడుగా ఉన్న స్టాక్ మార్కెట్లు శుక్రవారం కూడా మంచి లాభాల్లో ఎంట్రీ ఇచ్చాయి. 9200 మార్కును చేధించిన నిఫ్టీ ప్రస్తుతం 30.75 పాయింట్ల లాభంలో 9184 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ సైతం 153 పాయింట్ల లాభంలో 29,739 వద్ద కొనసాగుతోంది. ప్రధాని మంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో బీజేపీ ఎంతో కీలక రాష్ట్రమైన యూపీలో చారిత్రాత్మక విజయం సాధించింది. దీంతో మార్కెట్లు గరిష్టస్థాయిల్లో రికార్డులు సృష్టిస్తున్నాయి. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్రప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుచేయడం ఆర్థిక ప్రక్రియకు ఊతమిస్తుందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆర్థిక సహకారం ఏర్పడుతుందని విశ్లేషకులంటున్నారు. దీంతో చాలా వేగవంతంగా కేంద్ర, రాష్ట్ర ప్రాజెక్టులు పూర్తిచేయొచ్చని పేర్కొంటున్నారు.
ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలోని జీఎస్టీ కౌన్సిల్ గురువారం, ఎంతో కీలకమైన రాష్ట్రాలరాష్ట్రాల జీఎస్టీ (ఎస్‌జీఎస్టీ), కేంద్ర పాలిత ప్రాంతాల జీఎస్టీ (యూటీజీఎస్టీ)లకు ఆమోదం తెలిపింది. దీంతో జూలై 1 నుంచి జీఎస్టీ అమలుకు ప్రక్రియ వేగవంతమవుతోంది. మరోవైపు అంచనావేసిన దానికంటే దేశీయ కంపెనీల క్యూ3లో మంచి ఫలితాలను విడుదల చేయడం, దేశానికి ఆర్థిక ఊతం కల్పిస్తూ కేంద్ర బడ్జెట్ రావడంతో ఈ ఏడాది ప్రారంభమైనప్పటి నుంచి మార్కెట్లు 10 శాతానికి పైగా ర్యాలీ జరిపినట్టు తెలుస్తోంది. ట్రేడింగ్ ప్రారంభంలో ఐటీసీ, టీసీఎస్, ఏసియన్ పేయింట్స్, విప్రో, లుపిన్, ఎం అండ్ ఎం, పవర్ గ్రిడ్, టాటా స్టీల్ లాభాలు పండించగా... ఎల్ అండ్ టీ, గెయిల్, టెక్ మహింద్రా, బీపీసీఎల్, హెచ్డీఎఫ్సీ ఒత్తిడిలో కొనసాగుతున్నాయి.
Advertisement
Advertisement