8000 దిగువకు కుప్పకూలిన నిఫ్టీ
8000 దిగువకు కుప్పకూలిన నిఫ్టీ
Published Thu, Dec 22 2016 1:08 PM | Last Updated on Mon, Sep 4 2017 11:22 PM
మార్కెట్లో పాజిటివ్ సంకేతాలు సన్నగిల్లడంతో ఈక్విటీ బెంచ్మార్కులు భారీగా కుప్పకూలుతున్నాయి. వరుసగా ఏడో సెషన్లోనూ నష్టాల్లో తాకిడి కొనసాగుతోంది. గురువారం ప్రారంభంలోనే అమ్మకాల ఒత్తిడితో వంద పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్, మధ్యాహ్నం సెషన్లో మరింత పతనమై 250 పాయింట్ల నష్టంలో కొనసాగుతోంది. దీంతో సెన్సెక్స్ 26వేల దిగువకు చేజారి 25,990వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ సైతం 81.75 పాయింట్ల నష్టంలో 8000 దిగువకు పడిపోయింది. నిఫ్టీ మెటల్ షేర్లు 2 శాతానికి పైగా పతనమవుతున్నాయి. అదేవిధంగా బ్యాంకు ఇండెక్స్ సైతం అమ్మకాల తాకిడిని ఎదుర్కొంటోంది. టాటా స్టీల్, హిందాల్కో ఇండస్ట్రీస్ నిఫ్టీ 50 స్టాక్స్ టాప్ లూజర్స్గా కొనసాగుతున్నాయి. ఈ రెండు కంపెనీల షేర్లు దాదాపు చెరో 3 శాతం చొప్పున పడిపోతున్నాయి.
ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ, ఎల్ అండ్ టీ, ఓఎన్జీసీ, యాక్సిస్ బ్యాంకు, మారుతీ సుజుకీ షేర్లూ 1-2 శాతం కుప్పకూలాయి. గ్లోబల్ ట్రెండ్ రిస్కులో కొనసాగుతుండటంతో వర్ధమాన మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొన్నట్టు మార్కెట్ విశ్లేషకుడు రాకేష్ అరోరా చెప్పారు. అంతేకాక పెద్ద నోట్ల రద్దు అనంతరం డిసెంబర్ త్రైమాసిక ఫలితాల ఎఫెక్ట్ కూడా మార్కెట్లపై చూపుతుందన్నారు. డిసెంబర్ త్రైమాసిక ఫలితాలు, డిసెంబర్ అమ్మకాల డేటా, ఎకనామిక్ డేటా ఫలితాలు వచ్చే నెలలో విడుదల కానున్న నేపథ్యంలో మార్కెట్లు అతలాకుతలమవుతున్నాయని విశ్లేషకులు పేర్కొన్నారు. పాత నోట్ల రద్దుతో ఆర్థికవ్యవస్థపై సమీప కాలంలో కచ్చితంగా ప్రభావం ఉంటుందని ఇప్పటికే పలు రేటింగ్ ఏజెన్సీలు హెచ్చరించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సర గ్రోత్ రేటును కూడా అవి తగ్గించాయి. అయితే ఈ ఫలితం ఏ మేరకు ఉండబోతుందో వచ్చే నెలలో వెల్లడికాబోతుంది.
Advertisement
Advertisement