లక్నో: ఉత్తరప్రదేశ్లోని ఉన్నవ్ జిల్లా, కరోవన్ ప్రాంతంలో కల్తీ సారాయి తాగి ఐదుగురు మృతి చెందిన విషాద సంఘటన సోమవారం వెలుగుచూసింది. మృతులు కిషన్ పాల్, శాంట్ లాల్, కల్లు, జమునా, హనుమాన్గా పోలీసులు గుర్తించారు. దొంగసారాయికి బానిసైన మరో ముగ్గురు చావుబ్రతుకల మధ్య కాన్పూర్ ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతున్నట్టు తెలిపారు.
కాగా అక్రమంగా అమ్ముతున్న దొంగసారాయి అమ్మకాలను అడ్డుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకుగానూ, ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తొమ్మిది మంది ఎక్సైస్ శాఖ అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. ఎస్పీ మహేంద్ర పాల్ను డీజీపీ హెడ్క్వార్టర్స్కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
అలాగే ఉన్నవ్ జిల్లా ఎస్పీగా చిత్రకూట్ పవన్కు బాధ్యతలు అప్పగించినట్టు ప్రిన్సిపల్ హోం సెక్రటరీ దిబాషిష్ పండా పేర్కొన్నారు. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మెజిస్టీరియల్ విచారణ జరపాల్సిందిగా ఆదేశించారు. అంతేకాక రాష్ట్రంలో అక్రమంగా కల్తీ సారాయిని తయారుచేసి, అమ్ముతున్న దుకాణాలపై దాడులు నిర్వహించాలని అధికారులను అదేశించినట్టు ప్రిన్సిపల్ హోం సెక్రటరీ తెలిపారు. కాగా, ఈ ఘటనపై నగరం మేజిస్ట్రేట్ విచారించి, సంబంధిత రిపోర్ట్ను రాష్ట్ర ప్రభుత్వానికి దాఖలు చేయాల్సిందిగా అదేశించామని ఉన్నవ్ జిల్లా మేజిస్ట్రేట్ సౌమ్యా అగర్వాల్ అన్నారు.