నిర్భయ దోషికి ప్రభుత్వ సాయం | Nirbhaya juvenile to walk free on Dec 20, AAP government annonses Rs. 10,000 aid, Centre opposes move | Sakshi
Sakshi News home page

నిర్భయ దోషికి ప్రభుత్వ సాయం

Published Tue, Dec 15 2015 9:02 AM | Last Updated on Sun, Sep 3 2017 2:03 PM

నిర్భయ దోషికి ప్రభుత్వ సాయం

నిర్భయ దోషికి ప్రభుత్వ సాయం

న్యూఢిల్లీ: మహిళలపై జరిగిన అకృత్యాల్లో అత్యంత హేయమైనదిగా భావించే నిర్భయ ఉదంతంలో దోషిగా నిరూపితుడై, మూడేళ్ల శిక్షాకాలాన్ని పూర్తి చేసుకున్న బాలనేరస్తుడు(ఇప్పుడతని వయసు 20 ఏళ్లు) డిసెంబర్ 20న విడుదల కానున్నాడు.

 

జువైనల్ హోమ్ నుంచి విడుదలయిన తర్వాత, తిరిగి జనజీవన స్రవంతిలో కలిసిపోయేందుకు అతడికి సహకరిస్తామని, టైలర్ షాప్ ఏర్పాటుచేసుకునేందుకుగానూ 10వేల రూపాయల ఆర్థిక సాయం చేస్తామని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు శిక్షా కాలంలో బాల నేరస్తుడు పరివర్తన చెందలేదని, పైగా మరింత హింసాయుతగా మారినందున విడుదల నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం వాదిస్తోంది. అటు ఢిల్లీ సర్కార్, ఇటు కేంద్ర ప్రభుత్వాల భిన్నవిభిన్నవాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు బాలనేరస్తుడి విడుదలపై తన తీర్పును రిజర్వులో ఉంచింది.

బాలనేరస్తుడు విడుదలయ్యే రోజు.. జువైనల్ హోం వద్దకు అతడి కుటుంబ సభ్యులను రప్పించి, తిరిగి అందరినీ సురక్షితంగా స్వగ్రామం చేర్చేందుకు ఏర్పాట్లు చేశామని, తరలింపునకు అయ్యే రవాణా ఖర్చును కూడా తామే భరిస్తామని ఢిల్లీ మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు సోమవారం మీడియాకు వెల్లడించారు. స్వగ్రామంలోనై లేక మరోచోట అతడు టైలర్ షాప్ ఏర్పాటు చేసుకునేందుకు సహరిస్తామని, కుట్టు మిషన్, షాపు అద్దె, దారాలు తదితరాలు కొనుక్కునేందుకు రూ.10 వేల ఆర్థిక సాయం చేస్తామని అధికారులు చెప్పారు. కొత్త జీవితంలో అతడు నిలదొక్కుకునేలా అవసరమైతే మరో ఆరు నెలలు అతడికి అండగా ఉంటామనీ స్పష్టం చేశారు. కాగా, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఢిల్లీ సర్కార్ నిర్ణయాలను తప్పుపడుతోంది. దీంతో ఈ వ్యవహారం మరో 'ఆప్ వర్సెస్ సెంటర్'గా మారే అవకాశం ఉంది.  

తీవ్రమైన నేరాల్లో బాలనేరస్తులకు కూడా పెద్దలకు విధించే కఠిన శిక్షలనే అమలుచేయాలన్న బిల్లు లోక్ సభలో ఆమోదం పొంది, రాజ్యసభలో పెండింగ్ లో ఉంది. రాజ్యసభ ఏదోఒక నిర్ణయం వెలువరించేతవరకు బాలనేరస్తుడి విడుదల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోరాదని కేంద్ర ప్రభుత్వం వాదిస్తోంది. ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) ద్వారా సేకరించిన రహస్య సమాచారం మేరకు.. శిక్షా కాలంలో బాలనేరస్తుడు మరింత కర్కషంగా తయారయ్యాడని అదనపు సొలిసిటర్ జనరల్(ఏఎస్జీ) సంజయ్ జైన్ కేంద్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు. విడుదల అనంతరం బాలనేరస్తుడికి సహకరించాలనుకుంటున్న ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయాలను కూడా నిలిపివేసేలా ఆదేశాలు జారీచేయాలని కేంద్రం హైకోర్టును కోరింది. కేంద్రం ప్రతిపదనలపై స్పందించిన ఢిల్లీ అధికారులు.. జువైనల్ పరివర్తన చెందిందీ లేనిదీ ఏకపక్షంగా నిర్ణయించడం సరికాదంటున్నారు.

జువైనల్ విడుదలను నిలిపివేయాల్సిందేనని హైకోర్టులో పిల్ దాఖలు చేసిన బీజేపీ నేత సుబ్రహ్మణియన్ స్వామి మరో కొత్త విషయం చెప్పుకొచ్చారు. ఢిల్లీ బాలనేరస్తుల కారంగారంలోనే శిక్ష అనుభవిస్తున్న మరో జువైనల్ (ఢిల్లీ హైకోర్టు పేలుడులో దోషి)తో నిర్భయ దోషి పరిచయం పెంచుకున్నాడని, ఆ పరిచయం నిర్భయ దోషిని మరింత హింసాయుత ఆలోచనలవైపు నడిపించిందని, ఇప్పుడతను గతంలో కంటే మరింత ప్రమాదకరంగా మారాడని అందుకే విడుదలను నిలిపివేసి పెద్దలకు విధించిన శిక్షే అమలు చేయాలని కోరుతున్నట్లు సుబ్రహ్మణ్యస్వామి వెల్లడించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement