
నిర్మల్‌లో బాంబు కలకలం..
నిర్మల్ అర్బన్/నిర్మల్ రూరల్: ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ పట్టణంలోని కోర్టు ఆవరణలో బాంబు ఉందంటూ మంగళవారం వచ్చిన ఫోన్ కాల్ కలకలం సృష్టించింది. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో కోర్టు ఆవరణలో బాంబు పెట్టినట్లు ఓ ఆగంతకుడి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. దీంతో పోలీసులు ఉరుకులుపరుగులు పెట్టారు.
బాంబుస్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌ను రంగంలో దింపి కోర్టు భవనం అణువణువూ పరిశీలించారు. గంట పాటు కోర్టు ఆవరణలో ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. చివరికి ఏమీ లేదని తేలడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అయితే, వచ్చిన ఫోన్ కాల్‌పై విచారణ జరుపుతున్నట్లు రూరల్ సీఐ పురుషోత్తమాచారి విలేకరులకు తెలిపారు.