రెండు లక్షలు ధర తగ్గిన నిస్సాన్ సన్నీ
న్యూఢిల్లీ: జపనీస్ ఆటోమొబైల్ తయారీ సంస్థ నిస్సాన్ తన లేటెస్ట్ కారుపై భారీ తగ్గింపును ప్రకటించింది. మిడ్ సైజ్ సెడాన్ సన్నీ ధరను గురువారం భారత మార్కెట్లో దాదాపు రెండు లక్షల మేర ధర తగ్గించింది. 2017 లో లాంచ్ అయిన సన్నీ మోడల్ ధరలో రూ.1.99 లక్షల రూపాయల మేర తగ్గింపు అనంతరం దీని ప్రారంభ ధర రూ.6.99 లక్షలనుంచి రూ.8.99 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) అందుబాటులోకి తీసుకొచ్చినంది. ఉ త్పత్తిఖర్చులు తగ్గిన కారణంగా ఈ తగ్గింపు అని నిస్సాన్ ఒక ప్రకటనలో తెలిపింది.
కొత్త ధరల ప్రకారం, నిస్సాన్ సన్నీ పెట్రోల్ వేరియంట్ ఇప్పుడు రూ 6.99 లక్షలు, టాప్-ఎండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వేరియంట్ రూ 8.99 లక్షలకు అందుబాటులో ఉండనుంది. అదేవిధంగా, డీజిల్ మోడల్‌పై రూ.1.31 లక్షల కోత అనంతరం ఇప్పుడు రూ.7.49 లక్షల ధరకే ఉంది. టాప్-ఎండ్ వేరియంట్ పై రూ.94వేల తగ్గింపు అనంతరం రూ.8.99 లక్షలకే విక్రయించనుంది. గత ఏడాది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వేరియంట్ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ మైక్రా ధరను రూ.54వేలు తగ్గించింది.
లోకల్ ప్రొడక్షన్ కారణంగా ఈ తగ్గింపు ధరలను ప్రకటించినట్టు నిస్సాన్ ఇండియా ఎండీ అరుణ్ మల్హోత్రా ప్రకటించారు. ఉత్పత్తి ధరలు గణనీయంగా తగ్గిన కారణంగా ఈ ప్రయోజనాలను వినియోగదారులకు అందించాలని భావించినట్టు చెప్పారు. అందుకే తమ పాపులర్ అండ్ ప్రీమియం మోడల్ సెడాన్‌ను తక్కువ ధరల్లో అందించనున్నట్టు తెలిపారు.