'నా పుట్టిన రోజుకు యాడ్స్ ఇవ్వొద్దు'
పనాజీ: తన పుట్టినరోజుకు పుష్పగుచ్చాలు తీసుకురావొద్దని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ విజ్ఞప్తి చేశారు. వార్తా పత్రికల్లో ప్రకటనలు కూడా ఇవ్వొద్దని కోరారు. వీటికి వెచ్చించే డబ్బుకు చెన్నై వరద బాధితుల సహాయ నిధికి ఇవ్వాలని సూచించారు.
'డిసెంబర్ 13న నా 60వ జన్మదినం సందర్భంగా పుష్పగుచ్చాలు తీసుకురావొద్దు. పేపర్ ప్రకటనలు ఇవ్వొద్దు. చెన్నై వరద బాధితుల కోసం ప్రార్థించండి. వారికి అండగా నిలవండి. పుట్టెడు కష్టాల్లో ఉన్న చెన్నై వాసులు కోలుకునేందుకు మన వంతు సాయం చేద్దాం' అని పారికర్ ఒక ప్రకటనలో కోరారు. బొకేలు, ప్రకటనలకు ఖర్చుపెట్టే డబ్బులను చెన్నై వరద బాధితుల కోసం ఏర్పాటు చేసిన గోవా సీఎం సహాయ నిధికి ఇవ్వాలని పిలుపునిచ్చారు.
గోవా మాజీ ముఖ్యమంత్రి అయిన పారికర్ జన్మదిన వేడుకలకు 50 వేల మందిపైగా అతిథులు వస్తారని భావిస్తున్నారు. చెన్నై వరదల నేపథ్యంలో పనాజీలోని జింఖానా మైదానంలో నిర్వహించ తలపెట్టిన పారికర్ పుట్టినరోజు వేడుకలను రద్దు చేసేందుకు గోవా బీజేపీ విభాగానికి ఆదేశాలివ్వాలని ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ లేఖ రాసింది. పారికర్ జన్మిదిన వేడుకల కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి రూ. 15 కోట్లు వసూలు చేసిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి గిరీశ్ చోదంకర్ ఆరోపించారు. రెండు రోజుల అధికార పర్యటన నిమిత్తం పారికర్ అమెరికా వెళ్లారు.