Chennai flood victims
-
వృద్ధురాలి నుంచి సంచి లాక్కున్న ఇన్స్పెక్టర్
చెన్నై: వరదలతో సర్వం కోల్పోయి రోడ్డున పడ్డ బాధితులకు ఆపన్నహస్తం అందించాల్సింది పోయి ఓ పోలీసు అమానవీయంగా ప్రవర్తించాడు. వృద్ధురాలిని నుంచి సహాయ సామాగ్రిని దౌర్జన్యంగా లాక్కుని చక్కా పోయాడు. చెన్నైలోని ఎంజీ నగర్ కాలనీలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్ లో ప్రత్యక్షం కావడంతో సదరు ఖాకీవాలా చిక్కుల్లో పడ్డాడు. పెరియార్ కోయిల్ స్ట్రీట్ లో వరద బాధితులకు సహాయ సామాగ్రి అందిస్తుండగా ఎంజీ నగర్ పోలీసు స్టేషన్ కు చెందిన స్పెషల్ సబ్ ఇన్స్పెక్టర్ కుమార్ బైకుపై అక్కడికి వచ్చాడు. బైకుపైనే కూర్చుని ఓ వృద్ధురాలి నుంచి సహాయ సామాగ్రి కలిగిన సంచిని దౌర్జన్యంగా లాక్కుకోవడం వీడియోలో స్పష్టంగా కనబడింది. 20 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియో పోలీసుల దందాకు అద్దం పట్టింది. బాధ్యతగా వ్యవహారించాల్సిన పోలీసు వృద్ధురాలి నుంచి సహాయ సామాగ్రి లాక్కోవడం తనకు ఆశ్చర్యం కలిగించిందని ఓ వలంటీర్ వ్యాఖ్యానించాడు. ఇన్స్ పెక్టర్ కు ఎవరూ అడ్డుచెప్పకపోవడం శోచనీయమన్నారు. ఈ ఘటనపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు. అయితే వీడియో ఇంటర్నెట్ లో హల్ చల్ చేయడంతో నగర కమిషనర్ టీకే రాజేంద్రన్ స్పందించారు. ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు. మొత్తం వీడియో ఫుటేజీని చూసిన తర్వాత కుమార్ పై చర్యలు తీసుకుంటామన్నారు. -
శేషసాయి విరాళం రూ. 10 కోట్లు
చెన్నై: వరదలతో అతలాకుతలమైన చెన్నై వాసులకు ఆపన్నహస్తం అందించేందుకు విరాళాలు వెల్లువెత్తున్నాయి. బాధితుల పునరావాసం, సహాయ కార్యక్రమాల కోసం ఇప్పటివరకు రూ. 130.33 కోట్లు విరాళాలు వచ్చినట్టు తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. తాజాగా అగ్రశేణి కార్పొరేట్ కంపెనీలకు చెందిన ఇద్దరు ప్రముఖులు రూ. 16 కోట్లు సహాయం చేశారు. ఇన్ఫోసిస్ లిమిటెడ్ చైర్మన్ ఆర్ శేషసాయి రూ. 10 కోట్లు, కాగ్నిజెంట్ టెక్నాలజీస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రూ. 6.50 కోట్లు ముఖ్యమంత్రి జయలలితకు అందజేసినట్టు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. అక్టోబర్ నుంచి కురిసిన భారీ వర్షాలతో తమిళనాడులో 300 మందిపైగా మృతి చెందారు. ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. బాధితులను ఆదుకునేందుకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, సామాన్యులు తమకు తోచిన రీతిలో సహాయం అందిస్తున్నారు. -
అక్షయ్ కుమార్ ఉదారత
చెన్నై: బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ కుమార్ తన సహృదయాన్ని చాటుకున్నాడు. చెన్నై వరద బాధితుల సహాయార్థం కోటి రూపాయలు విరాళం అందించాడు. చెన్నై వరదలు తనను ఎంతో కలచి వేశాయని మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో అక్షయ్ పేర్కొన్నాడు. 'చెన్నై వరద దృశ్యాలు చూసి చలించిపోయిన అక్షయ్ కుమార్ బాధితులకు తనవంతు సాయం చేయాలని భావించారు. వెంటనే దర్శకుడు ప్రియదర్శన్ కు, సుహాసినికి ఫోన్ చేశారు. సుహానిసిని సలహా మేరకు భూమిక ట్రస్టుకు రూ. కోటి అందించారు' అని ఆ ప్రకటనలో వెల్లడించారు. చెన్నై వరద బాధితులను ఆదుకునేందుకు భూమిక ట్రస్టు విశేష సేవలు అందిస్తోంది. అక్షయ్ కుమార్ నుంచి భూమిక ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ, దర్శకనిర్మాత జయేంద్ర రూ. కోటి చెక్కు అందుకున్నారు. షారూఖ్ ఖాన్ 'దిల్ వాలే' టీమ్ కూడా చెన్నై వరద బాధితులకు రూ. కోటి సహాయం చేసింది. -
మినీ లారీ బోల్తా: ఒకరి మృతి
చిత్తూరు: మినీలారీ బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతిచెందగా, మరో నలుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన చిత్తూరు జిల్లాలోని వలమనేరు మండలం భూతలబండ వద్ద మంగళవారం చోటుచేసుకుంది. చెన్నై వరద బాధితులకు వస్తువులను మినీలారీలో తీసుకెళ్తుండగా అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
'నా పుట్టిన రోజుకు యాడ్స్ ఇవ్వొద్దు'
పనాజీ: తన పుట్టినరోజుకు పుష్పగుచ్చాలు తీసుకురావొద్దని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ విజ్ఞప్తి చేశారు. వార్తా పత్రికల్లో ప్రకటనలు కూడా ఇవ్వొద్దని కోరారు. వీటికి వెచ్చించే డబ్బుకు చెన్నై వరద బాధితుల సహాయ నిధికి ఇవ్వాలని సూచించారు. 'డిసెంబర్ 13న నా 60వ జన్మదినం సందర్భంగా పుష్పగుచ్చాలు తీసుకురావొద్దు. పేపర్ ప్రకటనలు ఇవ్వొద్దు. చెన్నై వరద బాధితుల కోసం ప్రార్థించండి. వారికి అండగా నిలవండి. పుట్టెడు కష్టాల్లో ఉన్న చెన్నై వాసులు కోలుకునేందుకు మన వంతు సాయం చేద్దాం' అని పారికర్ ఒక ప్రకటనలో కోరారు. బొకేలు, ప్రకటనలకు ఖర్చుపెట్టే డబ్బులను చెన్నై వరద బాధితుల కోసం ఏర్పాటు చేసిన గోవా సీఎం సహాయ నిధికి ఇవ్వాలని పిలుపునిచ్చారు. గోవా మాజీ ముఖ్యమంత్రి అయిన పారికర్ జన్మదిన వేడుకలకు 50 వేల మందిపైగా అతిథులు వస్తారని భావిస్తున్నారు. చెన్నై వరదల నేపథ్యంలో పనాజీలోని జింఖానా మైదానంలో నిర్వహించ తలపెట్టిన పారికర్ పుట్టినరోజు వేడుకలను రద్దు చేసేందుకు గోవా బీజేపీ విభాగానికి ఆదేశాలివ్వాలని ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ లేఖ రాసింది. పారికర్ జన్మిదిన వేడుకల కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి రూ. 15 కోట్లు వసూలు చేసిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి గిరీశ్ చోదంకర్ ఆరోపించారు. రెండు రోజుల అధికార పర్యటన నిమిత్తం పారికర్ అమెరికా వెళ్లారు. -
‘చెన్నై వరద బాధితులకు అండగా ఉంటాం’
న్యూఢిల్లీ: భీకర వర్షాలకు అల్లాడుతున్న చెన్నై నగరవాసుల్లో భారత క్రికెటర్లు మురళీ విజయ్, ఆర్.అశ్విన్ కుటుంబసభ్యులు కూడా బాధితులుగా ఉన్నారు. ఈ ఉపద్రవంలో మరణించిన వారికి నివాళి అర్పిస్తున్నట్టు క్రికెటర్లు తెలిపారు. ప్రస్తుత దక్షిణాఫ్రికా సిరీస్ ముగియగానే ప్రభావిత ప్రాం తాల్లో సహాయం చేస్తామని అన్నారు. ‘చెన్నైని వర ద ముంచెత్తినా నగర వాసులు కొందరు ధైర్యంగా ఇతరులకు సహాయపడుతున్నందుకు గర్విస్తున్నాను. ఇందులో నా స్నేహితులు నటుడు సిద్ధార్థ్, ఆర్జే బాలాజి కూడా ఉన్నారు. ఈ కష్ట సమయం లో చెన్నై నగరం ధైర్యంగా ఉంది. సిరీస్ ముగిశాక బాధిత కుటుంబాలకు నా చేతనైనంత సహాయాన్ని కచ్చితంగా అందిస్తాను’ అని స్పిన్నర్ అశ్విన్ తెలి పాడు. అలాగే ప్రస్తుత తరుణంలో తన కుటుంబం తో పాటు లేనందుకు బాధపడుతున్నానని ఓపెనర్ మురళీ విజయ్ తెలిపారు. త్వరలోనే పరిస్థితులు చక్కబడతాయని విశ్వాసం వ్యక్తం చేశాడు. -
'ఇప్పుడు వారి వద్ద లేకపోవడం కలతగా ఉంది'
న్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాలకు చెన్నైతో సహా పలు జిల్లాలో వరద ముంపునకు గురయ్యాయి. ఇలా వరద బారిన పడిన వారిలో టీమిండియా ఆటగాళ్ల కుటుంబాలు కూడా ఉన్నాయి. చెన్నైకు చెందిన మురళీ విజయ్, రవిచంద్రన్ అశ్విన్ కుటుంబాలు వరదలో చిక్కుకున్నాయి. చెన్నై వరద బాధితులకు సాయం చేసేందుకు ఈ ఇద్దరు ఆటగాళ్లతో పాటు అజింక్యా రహానే కూడా ముందుకొచ్చాడు. వరద బాధితులకు తన వంతు సాయం చేస్తానని రహానే ప్రకటించాడు. దీనిపై విజయ్ స్పందిస్తూ ఇప్పుడు తాను కుటుంబ సభ్యులు వద్ద లేకపోవడం తీవ్రంగా కలిచి వేస్తోందన్నాడు. 'తమిళనాడులోని పలు ప్రాంతాలు తీవ్ర వరద ముంపుకు గురవ్వడం ఆందోళనగా ఉంది. ఇది నిజంగా బాధాకరం. అక్కడి పరిస్థితులు త్వరలోనే సాధారణ స్థితికి వస్తాయని ఆశిస్తున్నా. ప్రజలంతా మనోధైర్యంతో ఉండాలి. ఈ సమయంలో నా కుటుంబ సభ్యులతో లేకపోవడం బాధగా ఉంది. నా కుటుంబ సభ్యుల ఇచ్చే ధైర్యమే నాకు అదనపు శక్తి. వరద బాధితులకు అండగా ఉంటా' అని మురళీ పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న సిరీస్ ముగిసిన అనంతరం తాను సహాయక చర్యల్లో పాల్గొంటానని మరో ఆటగాడు రవి చంద్రన్ అశ్విన్ పేర్కొన్నాడు. తన స్నేహితులైన నటుడు సిద్దార్ధ, ఆర్ జే బాలాజీలు వరద బాధితులు అండగా నిలవడం అభినందించదగ్గ విషయమని అశ్విన్ తెలిపాడు.