'ఇప్పుడు వారి వద్ద లేకపోవడం కలతగా ఉంది'
న్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాలకు చెన్నైతో సహా పలు జిల్లాలో వరద ముంపునకు గురయ్యాయి. ఇలా వరద బారిన పడిన వారిలో టీమిండియా ఆటగాళ్ల కుటుంబాలు కూడా ఉన్నాయి. చెన్నైకు చెందిన మురళీ విజయ్, రవిచంద్రన్ అశ్విన్ కుటుంబాలు వరదలో చిక్కుకున్నాయి. చెన్నై వరద బాధితులకు సాయం చేసేందుకు ఈ ఇద్దరు ఆటగాళ్లతో పాటు అజింక్యా రహానే కూడా ముందుకొచ్చాడు. వరద బాధితులకు తన వంతు సాయం చేస్తానని రహానే ప్రకటించాడు.
దీనిపై విజయ్ స్పందిస్తూ ఇప్పుడు తాను కుటుంబ సభ్యులు వద్ద లేకపోవడం తీవ్రంగా కలిచి వేస్తోందన్నాడు. 'తమిళనాడులోని పలు ప్రాంతాలు తీవ్ర వరద ముంపుకు గురవ్వడం ఆందోళనగా ఉంది. ఇది నిజంగా బాధాకరం. అక్కడి పరిస్థితులు త్వరలోనే సాధారణ స్థితికి వస్తాయని ఆశిస్తున్నా. ప్రజలంతా మనోధైర్యంతో ఉండాలి. ఈ సమయంలో నా కుటుంబ సభ్యులతో లేకపోవడం బాధగా ఉంది. నా కుటుంబ సభ్యుల ఇచ్చే ధైర్యమే నాకు అదనపు శక్తి. వరద బాధితులకు అండగా ఉంటా' అని మురళీ పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న సిరీస్ ముగిసిన అనంతరం తాను సహాయక చర్యల్లో పాల్గొంటానని మరో ఆటగాడు రవి చంద్రన్ అశ్విన్ పేర్కొన్నాడు. తన స్నేహితులైన నటుడు సిద్దార్ధ, ఆర్ జే బాలాజీలు వరద బాధితులు అండగా నిలవడం అభినందించదగ్గ విషయమని అశ్విన్ తెలిపాడు.